YS Vivekananda Reddy Murder: పులివెందులలో సీబీఐ టీం.. ఈసారైనా తేల్చేస్తారా?

682

YS Vivekananda Reddy Murder: మాజీ సీఎం రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు.. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యా నిందితులు ఎవరో ఇప్పటికీ తేలలేదు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తు చేయాలనీ డిమాండ్ చేశారు. అలా విచారణ సాగుతుండగానే ప్రభుత్వం మారింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఏడాది పాటు ఈ కేసులో ఎలాంటి కదలిక లేదు. చివరికి వివేకా కుమార్తె పట్టుబట్టి ఢిల్లీలో పెద్దలను కలిసి, కోర్టులను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుకి కదలిక తెచ్చారు.

కరోనా లాక్ డౌన్ సాగుతున్న సమయంలో సీబీఐ బృందాలు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పులివెందుల అడ్డాగా ఈ విచారణ సాగించగా కేసులో ఆరంభం నుండి సీబీఐ బృందాలు కీలక వ్యక్తులను విచారించారు. సీబీఐ బృందంలో కొందరు కరోనా బారిన పడడంతో కొద్ది రోజులు విచారణకు బ్రేక్ పడగా మళ్ళీ మూడు నెలల క్రితం మరోసారి విచారణ మొదలైంది. ఈ సమయంలోనే వైస్ కుటుంబంలోని కీలక వ్యక్తులను విచారించనున్నారని ప్రచారం జరిగింది. కానీ ఏ జరిగిందన్నది ప్రపంచానికి తెలియకుండానే సీబీఐ బృందాలు ఢిల్లీకి వెళ్లిపోయాయి.

కనీసం లోకల్ పోలీసులను కూడా తమ విచారణలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సీబీఐ ఇప్పుడు మరోసారి పులివెందులలో విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వివేకా కుమార్తె భారీ స్థాయిలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐకి అప్పగించినట్లుగా తెలుస్తుండగా ఇప్పుడు మరోసారి అందరి చూపు సీబీఐ విచారణ మీద పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరో తేలితే మరోసారి రాష్ట్రాన్ని కుదిపేసే రాజకీయాలు తెరమీదకి రావడం ఖాయం. కానీ సీబీఐ ఈసారైనా నిందితులను తేల్చేస్తుందా.. ఇంకా సాగదీతతోనే సరిపెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.

పులివెందులలో సీబీఐ టీం.. ఈసారైనా తేల్చేస్తారా?