YS Sharmila political party: ఈనెల 20న ఖమ్మం నేతలతో భేటీ!

407

YS Sharmila political party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో యమా దూకుడుగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న మంగళవారం తొలిసారి ఆమె పొలిటికల్ ప్రక్రియపై స్పష్టత నివ్వగా అదే రోజు లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులు, రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కానీ.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాటల్లో కానీ ఎక్కడా కొత్త ఏర్పాటు అంశం లేవనెత్తకపోయినా కొత్త పార్టీ ఏర్పాటు దాదాపుగా ఖాయమేనని రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతుంది.

ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాట్లపై ముమ్మర ఏర్పాటు మొదలు పెట్టిన షర్మిల బుధవారం కూడా ఇంటికి వచ్చిన నేతలతో పలు చర్చలు జరిపారు. బుధవారం షర్మిల భర్త అనిల్ కుమార్ పుట్టినరోజు కావడంతో భారీగా అభిమానులు షర్మిల నివాసానికి క్యూ కట్టగా ఇప్పటికే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం కోసం వెతుకులాట పారంభమైనట్లుగా తెలుస్తుంది. కాగా.. ఈనెల 20న ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులు, రాజకీయ నేతలతో సమావేశం కావాలని షర్మిల ఇప్పటికే నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన నేతలకు సమాచారం అందిందట.

ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అనంతరం షర్మిల కొత్త పొలిటికల్ పార్టీ అంశంపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తుండగా అదే రోజు షర్మిల పొలిటికల్ ఎజెండా కూడా వెల్లడించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ పేరుతో తెలంగాణలో రిజిస్టర్ అయిన కొన్ని పార్టీల పేర్లను పరిశీలిస్తున్న షర్మిల పొలిటికల్ టీం.. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఉండేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు పాదయాత్ర చేపడితే ముందుగా ఏ జిల్లా నుండి మొదలు పెట్టాలి అనే అంశంపై కూడా కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.