Ys Sharmila Party: గిరిజన ఓటు బ్యాంకు కోసమే ఖమ్మం పర్యటన?

373

Ys Sharmila Party: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుఫై దూకుడుగా ఉన్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లోటస్ పాండ్ వేదికగా రోజూ పార్టీ ఏర్పాటు, నేతలతో సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. గతంలో కూడా వైసీపీకి పట్టున్న ప్రాంతంగా పేరున్న ఖమ్మం జిల్లా పర్యటనకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలతో సమావేశమైన షర్మిల ఈనెల 21న హైదరాబాద్ నుండి భారీ ర్యాలీతో ఖమ్మంకు చేరుకోవాలని ప్రణాళికకు సిద్ధం చేసుకున్నారు.

షర్మిల ఖమ్మం పర్యటనను ఆ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా సామజిక, ఆర్థిక సమీకరణాలను బేస్ చేసుకొనే నేతలను, ప్రజలను ఆకర్షించేందుకు ప్రణాళికలను రచించినట్లుగా రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఖమ్మం జిల్లాలో గిరిజనలు అధికంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గిరిజనులకు ఇళ్ల, వ్యవసాయ భూముల పట్టాల పంపిణీ చేశారు. అయితే.. ఆ పట్టాలు ఇప్పటికీ కోర్టు కేసులలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు షర్మిల మళ్ళీ రాజన్న రాజ్యంతోనే పట్టాల సమస్యకు పరిష్కారమనే నినాదాన్ని అందుకోనున్నారని తెలుస్తుంది.

ఇక షర్మిల కొత్త పార్టీ ఖమ్మం జిల్లా గిరిజనులను ఆకర్షించే మరో అంశం క్రిస్టియానిటీ. నిజానికి ఇక్కడ ఉన్న గిరిజనులలో చాలా కుటుంబాలు ఎప్పుడో మతం మారి క్రైస్తవంలోకి వెళ్లిపోయాయి. అక్షరాస్యత చాలా తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో రకరకాల కారణాల ఆకర్షణతో మతమార్పిడులు జరిగిపోయాయన్నది అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన అంశమే. ఇదే ఇప్పుడు ఇక్కడ గిరిజనుల ఆకర్షించేందుకు షర్మిలకు కలిసివచ్చే అంశంగా మారింది. ఖమ్మం లోక్ సభ పరిధిలో కూడా ఈ గిరిజనులే కీలకం కాగా వీరిని ఆకర్షిస్తే జిల్లాలో తమ పార్టీ ఉనికికి ఎలాంటి ఢోకా ఉండదన్నది షర్మిల ఆలోచనగా తెలుస్తుంది.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గిరిజన పోడు భూముల కోసం పోరాడుతున్న నేత షర్మిలతో కలిసి పనిచేసేందుకు సిద్దమవగా ఆ జిల్లా పార్టీని తన చేతుల్లోనే పెట్టేందుకు కూడా షర్మిల సిద్ధపడినట్లుగా చెప్తున్నారు. మొత్తంగా షర్మిల పక్కా వ్యూహంతో, పగడ్బంధీ ప్రణాళికతోనే రాజకీయ అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ మేధావులు అంచనా వేస్తుండగా ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం కొత్త పార్టీ, విధివిధానాలపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Ys Sharmila Party: గిరిజన ఓటు బ్యాంకు కోసమే ఖమ్మం పర్యటన?