కొత్తపార్టీ పెడుతున్న షర్మిళ.. కార్యాలయం అక్కడే

169

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిళ కొత్తపార్టీ పెడుతున్నారు. తెలంగాణలో ఈ పార్టీని ఏర్పాటు చెయ్యనున్నారు. పార్టీ పేరు రాజన్న రాజ్యం అని సమాచారం. ఇక మంగళవారం ఆమె నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఆమె భర్త అనిల్ తో కలిసి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే షర్మిళ కొత్తపార్టీపై అనేక అనుమానాలు వస్తున్నాయి.

జగన్ తో విభేదాలు రావడం వల్లనే షర్మిళ కొత్త పార్టీ పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు గొనె ప్రకాష్ తెలిపారు. జగన్ సీఎం అయినతరువాత షర్మిళ ఒక్కసారి కూడా పులివెందులకు వెళ్లలేదని తెలిపారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ ఇవ్వలేదని, రాజ్యసభకు కూడా పంపకపోవడంతో ఆమె మనోవేదనకు గురైందని ఓ ఇంటర్వ్యూ లో గొనె ప్రకాష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భర్త అనిల్ తో కలిసి పార్టీ పెడుతున్నారని తెలిపారు. అయిదు, ఆరు నెలల క్రితమే పార్టీ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే పార్టీ కార్యాలయాన్ని కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. షర్మిళ కొత్త కార్యాలయం గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. లోటస్ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ చిత్రం కనిపించలేదు. షర్మిళ, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు మాత్రమే అందులో ఉన్నాయి.. ఇక ఈ సమావేశంలో వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ విధేయుడిగా పేరున్న శ్రీకాంత్ రెడ్డి షర్మిళ సమావేశానికి వస్తారని అందరు అనుకుంటున్నారు.