నేడు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు

178

ప్రజాసంక్షేమమే తన సంక్షేమమని భావించే అరుదైన రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు.. మాట ఇస్తే వెనక్కెళ్లే తత్వంలేని మనసత్త్వం.. నమ్మిన విలువల కోసం ఎంతటి కష్టాన్నైనా.. ఎంతటి వారినైనా ఎదిరించగల ధీరత్వం ఆయన సొంతం.. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నేడు సీఎం జగన్ 48వ పుట్టిన రోజు.. ఆయన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.

సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూశాడు.. పేదల బాధలు విన్నాడు.. ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. యువనేతగా వచ్చి జననేతగా ఎదిగిన జగన్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.. మొదట వ్యాపారవేత్తగా.. పవర్ ప్రాజెక్టు, సాక్షి మీడియా, భారతి సిమెంట్ కంపెనీలను స్థాపించి వేలాదిమంది నిరుద్యోగులకు ఆసరాగా నిలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్.. 2009 లో కడప పార్లమెంటుకు పోటీ చేసి ఘనవిజయం సాధించారు.. తద్వారా తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టారు.

అయితే ఆయనకు ఈ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు.. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నాలుగు నెలల గడవకుండానే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆనాడు వందలాది మంది గుండె ఆగింది. దాంతో వారందరి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు.. తొలుత ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలో ఈ యాత్ర సాగింది.. అనూహ్య ప్రజాస్పందన వచ్చింది. అయితే ఓదార్పు యాత్రలో ఉండగానే ఆయనకు ఢిల్లీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి.. ‘మీరు ఓదార్పు యాత్ర ఆపండి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుకుం జారీ చేశారు.. అయితే ఇది నచ్చని జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశారు.. సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

వైకాపా తరఫున ఉపఎన్నికలకు వెళ్లారు.. దీంతో ఎవ్వరు సాధించని మెజారిటీతో కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన తల్లి విజయమ్మ సంచలన విజయం సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలు పెట్టారు.. చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరిపోయారు.. ఈ క్రమంలో చాలా చోట్ల ఉపఎన్నికల కూడా వచ్చాయి.. దాదాపు అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఉపఎన్నికల సమయం నుంచే జగన్ కు కష్టాలు మొదలయ్యాయి..

జగన్ పై సిబిఐ కేసులు నమోదు అయ్యాయి.. దాంతో 16 నెలలు జైలులో ఉండాల్సి వచ్చింది.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా పాలన సాగించాలి అని జైల్లో నే కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు.. తమ మాట వింటే మంచి భవిశ్యత్ ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు కొందరు చెప్పినా తిరిగి కాంగ్రెస్ లో చేరలేదు.. వరుస కేసులు పెట్టి వేధిస్తున్నా.. మరోవైపు గోరుచుట్టుమీద రోకటిపోటులా ఆయన వ్యతిరేక మీడియా లేనిపోని కథనాలు వండి వార్చినా వెన్నుచూపకుండా తన పంథాను కొనసాగిచారు.

తాను జైల్లో ఉన్నా ప్రజల్లో పార్టీ ప్రాభవం తగ్గిపోకుండా చెల్లెలు షర్మిలను పాదయాత్రకు పంపించారు.. ఈ క్రమంలో రాష్ట్రం కూడా రెండు ముక్కలయింది. అయితే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు జగన్.. జైల్లోనే నిరాహార దీక్ష చేశారు.. ఇక సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయనకు బెయిల్ లభించింది.. దాంతో హైదరాబాద్ లో సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు.. చెల్లెలు షర్మిలను సమైక్యశంఖారావం పేరుతోనే రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేయించారు..

ఈలోపే సాధారణ ఎన్నికలు వచ్చాయి.. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి రాకపోయినా జగన్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు.. నిత్యం జనాల్లోకి వెళుతూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లారు.. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా భయపడలేదు.. సంవత్సరం పైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు.. ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవుతూ మళ్ళీ మరుసటి రోజు నడిచేవారు.. ఇలా 3,648 కిలోమీటర్లు నడిచారు.. వందలాది బహిరంగసభల్లో ప్రసంగించారు.. పాదయాత్రలో ఉండగానే నవరత్నాలు అంకురార్పణ చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు..

ఫైనల్ గా ఆయన జీవిత ఆశయం నెరవేరింది. కష్టపడితే సాధించనిది ఏది లేదు అన్నట్టు పదేళ్ల కష్టానికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. ఏ పార్టీ సాధించని సీట్లతో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.. ఆ తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్రుల అభిమాన నాయకుడయ్యారు.. ఈ సందర్బంగా జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ‘ఊరువాడ’ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.