బావ వేధింపులు తట్టుకోలేక మరదలు ఆత్మహత్య

192

బావ వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన అన్నారావు, సత్యవతిల ఏకైక కుమార్తె గీతాసురేఖ.. ఈమెకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు, భర్త శ్రీనివాసరావు ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆయన అన్న శివశంకర్ మరదలిపై కన్నేశాడు.

కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేక గీతాసురేఖ జనవరి 15 న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి వచ్చాడు. తమ కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పాడు. అయితే పక్కనే సురేఖ పిల్లలు ఏడుస్తూ కనిపించారు. వారి దగ్గరికి వెళ్లిన రామకృష్ణ సురేఖ గురించి అరా తీసాడు.

అమ్మ ఇంట్లో కదలకుండా పడి ఉందని పిల్లలు చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు రామకృష్ణ.. పురుగులమందు తాగినట్లు గుర్తించి వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే సురేఖ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దింతో కుటుంబ సభ్యులు సురేఖ మృతికి మామ ఆదిశేషు, బావ శివశంకర్ కారణమని వారిపై కేసు పెట్టారు. ఇక పిల్లల రోదనతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

బావ వేధింపులు తట్టుకోలేక మరదలు ఆత్మహత్య