మహిళ చివరి కోరిక : రెండుసార్లు ఖననం

215

అనారోగ్యంతో మరణించిన మహిళను రెండుసార్లు ఖననం చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌, మన్‌మద్‌ లో జరిగింది. తన భర్త పక్కనే మహిళను ఖననం చేయడానికి, ఆమె కుమారుడు మూడు నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు తన తల్లి కోరిక నెరవేర్చాడు. చనిపోయిన తరువాత తన శవాన్ని భర్త పక్కనే పాతిపెట్టాలని.. ఆసుపత్రిలో తన చివరి కోరికను వ్యక్తం చేసిందామహిళ.

న్యుమోనియాతో మరణం

మన్‌మద్ లోని దామ్రే మాలా ప్రాంతంలో నివసిస్తున్న మంజులత వసంత క్షీరసాగర్ (76) సెప్టెంబర్ 21న మరణించారు. ఆమె న్యుమోనియా కారణంగా మరణించారని వైద్యులు తెలిపారు. కరోనా భయం కారణంగా అధికారులు ఆమెకు RT-PCR పరీక్షను చేశారు. అయితే నివేదిక బయటకు రాకముందే క్రైస్తవ ఆచారం ప్రకారం మంజూల మృతదేహాన్ని మాలెగావ్‌లోని శ్మశాన వాటికలో ఖననం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆమె చివరి కోరిక అలాగే మిగిలిపోయింది.

సఫలం కానీ మొదటి ప్రయత్నం

సెప్టెంబర్ 22న, మలేగావ్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి ఎన్ఓసి తీసుకోవటానికి మంజులత కుమారుడు సుహాస్ అక్కడికి వెళ్లారు. తల్లి నివేదికను పరిశీలించగా కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో తల్లి చివరి కోరికను గుర్తుంచుకున్న కొడుకు.. మృతదేహాన్ని సమాధి నుండి బయటకు తీసి మన్‌మద్ లోని తన తండ్రి సమాధి వద్ద ఖననం చేయాలనీ మాలెగావ్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఒక లేఖ రాశాడు, కాని స్పందన లేదు.

దీని తరువాత సుహాస్ ప్రతిరోజూ మునిసిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి తన అభ్యర్ధన గురించి వాకబు చేస్తున్నారు.. ఇలా 64 రోజుల తరువాత, నవంబర్ 23న, మునిసిపల్ కార్పొరేషన్ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) అందుకున్నాడు. అయితే మృతదేహాన్ని ఖననం చేయడానికి కార్పొరేషన్ ఎన్ఓసి అవసరం అయింది.

దానికి తోడు మాలెగావ్ తహశీల్దార్ నుండి క్లియరెన్స్ కూడా అవసరం అన్నారు అధికారులు. ఈ క్రమంలో నవంబర్ 25న సుహాస్ తహశీల్దార్‌కు లేఖ రాశారు. 19 రోజుల తరువాత ఆ తహశీల్దార్ చంద్రజిత్ రాజ్‌పుత్.. మాలెగావ్‌లో ఖననం చేసిన మృతదేహాన్ని మన్‌మద్‌కు తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారు.

మార్గం సులువు కాలేదు

అయితే అప్పుడు కూడా సుహాస్ మార్గం అంత సులభం కాలేదు. 100 రూపాయల బాండ్‌పై నిబంధనలు పాటించాలన్న అఫిడవిట్ తోపాటు.. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఎన్‌ఓసి, మలేగావ్ క్యాంప్ చర్చి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎన్‌ఓసి, మన్‌మద్ క్రిస్టియన్ మిషనరీ ఎన్‌ఓసి, మెడికల్ సర్టిఫికేట్ వంటి పలు పత్రాలను ఆయన సమర్పించాల్సి వచ్చింది.

అంత్యక్రియలకు అనుమతి

ఇవన్నీ పూర్తయిన తరువాత మాలెగావ్ తహశీల్దార్ ఆదేశాల మేరకు మలేగావ్ మేజిస్ట్రేట్ విధాటేతో సహా పలువురు అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని డిసెంబర్ 17 ఉదయం 8 గంటలకు రెండోసారి అంత్యక్రియలు నిర్వహించారు. మంజులత చివరి కోరిక ప్రకారం, తన భర్త పక్కన క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం సుహాస్ మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో చాలా కష్టంగా గడించింది. తల్లి చివరి కోరిక ఉన్నప్పటికీ, ప్రభుత్వ సూచనల ముందు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చిన తరువాత మా పోరాటం ప్రారంభమైంది. అధికారులు, మన్‌మద్, మాలెగావ్ మత పెద్దలు సహాయం చేశారు. తల్లి చనిపోయినందుకు విచారంగా ఉన్నా, కానీ ఆమె చివరి కోరికను నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఇక మలేగావ్‌కు చెందిన తహసీల్దార్ చంద్రజిత్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, ‘రెండోసారి అంత్యక్రియలు చేయడానికి సుహాస్ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ విషయంపై సీనియర్ అధికారితో చర్చించాం.. తల్లి మరియు కొడుకు మధ్య భావోద్వేగ సంబంధం గురించి అర్ధం చేసుకున్నాం.. అందువల్ల, మేము ఈ విషయంలో మానవతా దృక్పధంతో వ్యవహరించి.. ఆమె చివరి కోరికను నెరవేర్చడంలో సహాయపడ్డాము’ అన్నారు.