GHMC పీఠం ఎవరిది.. నేడు హైకోర్టు తీర్పు కీలకం?

164

GHMC ఎన్నికల యుద్ధం ముగిసినా.. పీఠం ఎవరిది అనే సమరం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి ఎన్నికలలో అనూహ్యంగా బీజేపీ పుంజుకొని 48 స్థానాలు దక్కించుకోవడంతో మేయర్ వ్యవహారం చిక్కుముడిగా మారింది. మొత్తం 150 స్థానాలలో 56 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకొనేందుకు తహతహలాడుతున్న తరుణంలో ఎక్స్ అఫిషియో ఓట్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నేడు హైకోర్టులో ఆ పిటిషన్ పై విచారణ జరగనుండగా తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది.

మొత్తం 150 డివిజన్లలో 55 ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఓట్లతో గ్రేటర్ లో ప్రజల తీర్పుకు విలువ లేకుండా పోతుందని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఎక్స్ ‌అఫిషియో ఓట్లకు అనుమతించే జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 90(1)ను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ ఓట్లను కలుపుకొని టీఆర్ఎస్ పార్టీ పీఠం దక్కించుకోవాలని చూస్తుండగా ఈ తీర్పు కీలకం అవుతుందా అనిపిస్తుంది. అయితే.. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వచ్చినా ఎంఐఎంతో కలిసి గ్రేటర్ పీఠం దక్కించుకునే అవకాశం కూడా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అసలు కోర్టు తీర్పు ఎలా ఉంటుందో.. మేయర్ ఎవరికి దక్కుతుందో చూడాల్సి ఉంది.