West Bengal: బీజేపీ డబ్బులు తీసుకొని టీఎంసీకి ఓటెయ్యండి!

213

West Bengal: దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఆయా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అన్ని పార్టీలు ఒకవైపు అభ్యర్థుల ఖరారు చేస్తూనే మరో వైపు ప్రచారంలో కూడా దూసుకుపోతున్నాయి. ఆదివారం ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనకు వచ్చి ప్రచారం చేయగా ప్రత్యర్థి మమతా బెనర్జీ సైతం సభలు, సమావేశాలు నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. డార్జిలింగ్‌ మోర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వందలాదిమంది కార్యకర్తల నడుమ మమత పాదయాత్ర చేశారు.

ఎల్‌పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా సిలిగురిలో సైతం మమతా పాదయాత్ర చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మోడీ సర్కార్ ఎల్‌పీజీని సామాన్యులకు దూరం చేస్తారంటూ దీదీ మండిపడ్డారు. ఎల్‌పీజీ సిలిండర్‌ను పోలిన ఎర్రటి ప్లకార్డులలతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్రలో దీదీతో పాటు తృణమూల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య, ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ పాల్గొన్నారు. ఈ ప్రచారంలో మాట్లాడిన మమతా.. రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఎత్తున నగదు పంచుతున్నారని ఎద్దేవా చేసిన మమతా వారిచ్చే డబ్బు తీసుకొని టీఎంసీకి ఓటేయాలని.. పెంచిన ధరలకు ఇదే గుణపాఠమని చెప్పారు.