పశ్చిమ బెంగాల్ అధికార భాషగా తెలుగు

53

తెలుగు ప్రజలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. తెలుగు వారు ఆనందపడేలా తెలుగుకు అధికార భాషా హోదా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మినీ ఆంధ్రా గా పేరున్న ఖరగ్ పూర్ లోని తెలుగు ప్రజల కోసం మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే పదికి పైగా అధికార భాషలు ఉన్నాయి. ఇక తెలుగు కూడా అధికార భాషగా గుర్తింపు పొందటంతో అక్కడ ఉన్న తెలుగువారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిటిష్ వారి పరిపాలన కాలం నుంచి ఉద్యోగాల కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లి స్థిరపడిన తెలుగువారు చాలామంది ఉన్నారు. వీరు రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. వివిధ పార్టీలలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కాగా ఖరగ్‌పూర్‌ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో 6 చోట్ల తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలుగు వాళ్లు.. కాగా వీరు చాలాకాలంగా తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వీరి డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అధికార భాషా హోదా కల్పిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బెంగాల్ విద్యాశాఖామంత్రి పార్థ ఛటర్జీ మీడియాకు వివరించారు. అయితే ప్రస్తుతం బెంగాల్ లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా, సంతాలీ, పంజాబీ, కంతపురి, రాజ్ బన్సీ, కుర్మాలి, కూరుఖ్ అధికార భాషలుగా ఉన్నాయి, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలుగు కూడా వీటి సరసన చేరిపోయింది.

పశ్చిమ బెంగాల్ అధికార భాషగా తెలుగు