warangal: కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి!

73

పంట కాలువలపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది కరీంనగర్ జిల్లా కాకతీయ కెనాల్ లో మూడు మృతదేహాలు బయటపడడం, కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బావ, చెల్లెలు, మేనకోడలిగా గుర్తించగా ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉపాధ్యాయురాలుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

మృతులు వరంగల్‌ నుంచి పర్వతగిరి వెళ్తున్న క్రమంలో కారు డ్రైవర్‌ వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే కాలువలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈత రావడంతో డ్రైవర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. కారులో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న సరస్వతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుతో పాటు మరో వ్యక్తి అందులోనే మృత్యువాతపడ్డారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కారు నీటిలో కొద్ది దూరం కొట్టుకుపోయింది.

వెనుక సీట్లో ఉన్న రెండు మృతదేహాలను వెలికి తీయగా ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి మృతదేహం కారులో చిక్కుకుపోయినట్లుగా తెలిసింది. కారును బయటకు తీస్తేనే మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుందని స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించగా ప్రస్తుతం కారును కాలువలో నుంచి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

warangal: కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి!