వాలంటీర్లకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

139

పంచాయితీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య జరిగిన రచ్చకు సుప్రీం తీర్పుతో తెరపడింది. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ మార్చుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా ఉన్న గ్రామా వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొన వద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.

వీరితోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేందుకు వీలు లేదని నిమ్మగడ్డ తెలిపారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో 3 లక్షలకు పైగా గ్రామ వార్డు వాలంటీర్లు ఉండగా, 60 వేల మంది గ్రామ సచివాలయ కార్యదర్శులు ఉన్నారు.

ఇక సిబ్బంది విషయమై సోమవారం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగ సంఘాల నేతలు విధులకు హాజరు కాలేమని చెప్పిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే 9 మంది అధికారులను బదిలీ చెయ్యాలని లేఖ రాశారు నిమ్మగడ్డ. 9 మందిలో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు ఉన్నారు.

సుప్రీం తీర్పు వచ్చిన అనంతరం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నందున బదిలీలు సరికావని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల వేళ కీలక ఆదేశాలు