Vizag Steel Plant: కేంద్రం సమాధానం.. ఏపీ సర్కారుకు తలనొప్పులు!

257

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు అన్నీ కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కు వెళ్ళేది లేదని ధీమాగా ఉంది. ఇప్పటికే వామపక్షాలు.. విద్యార్థి సంఘాలు.. పలువురు రాజకీయ ప్రముఖులు దీక్షలు, నిరసనలకు దిగగా ఇది క్రమేపీ ఉదృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో విశాఖ జిల్లా వైసీపీ నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు.

ఇక 22 మంది ఎంపీలున్నా ఢిల్లీలో ఎందుకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడం లేదని ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయంపై మరొకసారి పునరాలోచించుకోవాలని ప్రధానికి లేఖ రాయగా కేంద్ర పెద్దలు మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయం వెనకున్న లాభాలు ఇవ్వని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగానే పార్లమెంటులో కేంద్రం చెప్పిన సమాధానం ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త తలనెప్పులు తెచ్చిపెడుతుంది. తాజాగా రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన అంశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ షాకింగ్ సమాధానం ఇచ్చారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి ముందే తెలుసని చెప్పిన కేంద్ర మంత్రి.. దక్షిణ కొరియా ఉక్కు కార్పొరేట్ దిగ్గజం పోస్కోకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఓనర్ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ మధ్య నాన్‌ బైండింగ్‌ ఒప్పందం 2019 అక్టోబర్‌లోనే జరిగిందని.. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి తెలిసే జరిగిందని చెప్పారు. అప్పుడు పోస్కో ప్రతినిధులు జగన్‌తో భేటీ అయ్యారని మూడు సార్లు ప్లాంట్‌ను సందర్శించారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో రాజకీయ కలకలం ప్రారంభమైంది. పోస్కో ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయినపుడు అది కడప ఉక్కు పరిశ్రమ గురించి చర్చగా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేంద్రం అది విశాఖ ఉక్కు పరిశ్రమలో ఒప్పందం అని చెప్పింది.

ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అంతా తెలిసే సీఎం ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్రానికి లేఖ రాశారా? లేఖ నిజంగానే కేంద్రానికి రాశారా.. లేఖ మీడియాకు మాత్రమేనా? ఏపీ ప్రభుత్వానికి తెలుసంటే దాదాపుగా విజయసాయి రెడ్డికి తెలిసే జరుగుతుంది. మరి తెలిసి కూడా విజయసాయి రాజ్యసభలో ఎందుకు లేవనెత్తారు. ఇది కూడా రాజకీయ వ్యూహమా లేక బీజేపీ వ్యూహంలో వైసీపీ బలైందా. గత ఏడాదే పోస్కోకు ఒప్పందం జరిగింది మరో కొత్త ఫ్యాక్టరీకా.. ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని మెల్లగా నేలమట్టం స్థితికి తెస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల నుండి వస్తున్న ఎన్నో ప్రశ్నలు.

Vizag Steel Plant: కేంద్రం సమాధానం.. ఏపీ సర్కారుకు తలనొప్పులు!