స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సంచలన నిర్ణయం

15272

vishakha steel : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహాయమంత్రి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా ఉన్న అనురాగ్‌ ఠాకూర్ విశాఖ స్టీల్ పై మంగళవారం ఎంపీ సమ్మిత్ పాత్రకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొదట బీజేపీ ఎంపీ సమ్మిత్ పాత్ర రాజ్యసభలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్నీ లేవనెత్తారు.

ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన అనురాగ్ ఠాకూర్ దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను ఐదేళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని స్పష్టం చేశారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుందని ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.

మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది. దీనిపై కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు అఖిలపక్షంతో ఢిల్లీకి వస్తామని, అపాయింట్మెంట్ ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరారు. మరోవైపు అన్ని పార్టీలు విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉదృతం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నేతలు. విశాఖ ఉక్కు పరిశ్రమలోని పలు ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. మరోవైపు తెలంగాణ మావోయిస్టు పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది.

స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సంచలన నిర్ణయం