విశాఖ దుర్ఘటనలో నలుగురు మృతి.. 22 మందికి గాయాలు

101

విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 80 అడుగుల లోయలో పడింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతగిరి మండలం డముకు ఘాట్ రోడ్డు ఐదో మలుపు వద్ద జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా బస్సు లోయలో పడింది. కాగా ఇందులో ఉన్న వారంతా హైదరాబాద్ కు చెందిన వారు. విహయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఆర్బీఐ అధికారి కొట్టంసత్యనారాయణ కుటుంబ సభ్యులు సమయం దొరికినప్పుడల్లా విహాయ యాత్రకు వెళ్తుంటారు. ఇంతకాలం లాక్ డౌన్ ఉండటంతో కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లలేక పోయారు. ఇక లాక్ డౌన్ తీసేసి రవాణా వ్యవస్థ మొత్తం మెరుగుపడటంతో కుటుంబంతో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 10 న అందరు కలిసి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

భద్రాచలం రాముల వారిని దర్శించుకొని, అటునుంచి విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు.. అక్కడ దర్శనం అనంతరం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దింతో డ్రైవర్ ఒక్కసారిగా కేకలు వేశాడు.. బస్సు బ్రేకులు పడటం లేదని వారికీ తెలిపాడు. దింతో వారు భయాందోళనకు గురయ్యాయి.

ఇంతలోనే పెద్ద మలుపు వచ్చింది. బస్సు కంట్రోల్ కాకపోవడంతో వెళ్లి సైడ్ వాల్ ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. 80 అడుగుల లోటున్న లోయలో పడటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో 22 మంది గాయపడ్డారు. కాగా ప్రమాదంలో కొట్టం సత్యనారాయణ (62) శ్రీనిత్య (8నెలలు) సరిత(40) లత (40) మృతి చెందారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసేందుకు పరుగుపరుగున వచ్చారు.

అంబులెన్స్ సిబ్బంది కూడా వెంటనే స్పందించారు. గాయాలైన వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ట్రావెల్స్ బస్సు కండిషన్ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఇక బస్సును లోయలోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విశాఖ దుర్ఘటనలో నలుగురు మృతి.. 22 మందికి గాయాలు