ప్రత్యేక హోదా ఊసెత్తిన విజయసాయి.. సాధ్యమయ్యేదేనా?

298

ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది. అందునా దగాపడి విడిపోయిన రాష్ట్రంగా భావించిన ఏపీకి అంతకు మించి కూడా. కానీ.. అలాంటి ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఇదేంటి చంద్రబాబు ఇప్పుడు మాజీ అయ్యారు కదా.. ఇంకా సీఎం అన్నారేంటి అనుకుంటున్నారా?. పైన చెప్పిన ఆ వ్యాఖ్యలు స్వయంగా అన్నది ఇప్పుడున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ రెండు ముక్కలే కాదు. నాకు కనుక గంపగుత్తగా ఎంపీ సీట్లన్నీ ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెచ్చి రాష్ట్రాన్ని బ్రతికిస్తా. దాంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్. రాయతీలు ఉంటాయి కాబట్టి రాష్ట్రానికి కావాల్సినన్ని పరిశ్రమలు వస్తాయ్. ఇలా ఎన్నికల ప్రచారంలో ఊరు వాడ తిరిగి ఎన్నెన్నో చెప్పారు.

అదంతా గతం.. ఎన్నికల ముందు యవ్వారం. సీన్ కట్ చేస్తే ఎన్నికలయ్యాయి.. వైసీపీది గెలుపు అనేకన్నా సునామీ అనుకోవాలి. మరి ప్రత్యేక హోదా తెచ్చారా? కనీసం వస్తది.. వస్తుంది అనే ధీమా అయినా ఉందా? ఛాన్సే లేదు. గత ప్రభుత్వంలో చెప్పిన మా ప్రయత్నం మేం చేస్తున్నామనే మాట మళ్ళీ ఈ ప్రభుత్వం రిపీట్ చేస్తూనే ఉంది. పైగా ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రతినిధులు కలిసిన దాఖలాలు కూడా లేవు. ఏదోఒక పనిమీద ఢిల్లీ వెళ్ళినపుడు కాస్త ఇది కూడా చూడండి ప్లీజ్ అని హోదా అనే మాట గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కనీసం హోదా బదులు ప్యాకేజీ ఏదో ఇస్తామంటే దానికి ఒకే అన్నారు. మరి ఇప్పుడు ఆ ప్యాకేజీ ఎటు ప్యాక్ చేసారో కూడా తెలియదు.

ఇంకా లోతుగా నిజం మాట్లాడుకుంటే ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా వస్తుందని.. తెస్తారని.. కేంద్రం ఇస్తుందని కూడా నమ్మకం లేదు. అసలు ఆ ఊసే మర్చిపోయారు. కానీ ప్రభుత్వంలో నెంబర్ 2 గా చెప్పుకొనే ఎంపీ విజయసాయి మరోసారి హోదా విషయాన్ని గుర్తుచేశారు. అది కూడా పోరాటం చేస్తామని చెప్పారు. మరి సహజంగానే ఈ అంశంపై మళ్ళీ చర్చలు వస్తుంది కదా. కేంద్రం తెచ్చే ప్రతి బిల్లుకు ఏ మాత్రం వెనకాడకుండా.. ఎలాంటి బేషరతులు లేకుండా మద్దతు ఇచ్చే వైసీపీ ఎంపీలు హోదా మీద పోరాటం చేయగలరా? వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులకు సైతం ఒకే చెప్పిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను అడిగే సత్తా ఉందా అంటే జస్ట్ విజయసాయిది ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే. నమ్మే ఉద్దేశ్యం కానీ.. ఆశపడే అవకాశం కానీ ఏపీ ప్రజలకు ఏ మాత్రం లేదన్నది విశ్లేషకులు తేల్చేస్తున్న మాట!

ప్రత్యేక హోదా ఊసెత్తిన విజయసాయి.. సాధ్యయ్యేదేనా?