వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు

184

వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. వీరు వీరోచిత బ్యాటింగ్ అంటే అందరు తెగ ఇష్టపడతారు. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వీరు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఐపీఎల్ లో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఇక చాలా కాలంగా సెహ్వాగ్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. తాజాగా రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌ లో తిరిగి బ్యాట్ పట్టారు. ఈ జట్టులో ఇండియా హేమాహేమీలు ఉన్నారు.

ఇక శుక్రవారం ఇండియా లెజెండ్స్‌, బంగ్లాదేశ్‌ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీరు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 20 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశారు. 35 బంతుల్లో 80 పరుగులు పూర్తి చేసి జట్టుకు మంచి విజయం అందించారు. వయసు పెరిగినా తనలో సత్తువ ఏ మాత్రం తగ్గలేదని సెహ్వాగ్‌ మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ మొదటి బంతినే బౌండరీగా మలిచిన వీరు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు.

బంతి పడిందే ఆలస్యం అన్నట్లుగా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పాత సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చాడు. వీరు విధ్వంసం దాటికి ఇండియన్‌ లెజెండ్స్‌ కేవలం 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. సెహ్వాగ్‌కు జతగా వచ్చిన ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ 33 పరుగులతో అతనికి సహకరించాడు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేశారు. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో నిజాముద్దీన్‌ 49 మినహా ఎవరు ఇండియా లెజెండ్స్‌ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు.

ఇక ఇండియన్‌ లెజెండ్స్‌ బౌలింగ్‌లో వినయ్‌ కుమార్‌, ప్రగ్యాన్‌ ఓజా, యువరాజ్‌లు తలా 2 వికెట్లు తీయగా..మన్‌ప్రీత్‌ గోని, యూసఫ్‌ పఠాన్‌ చెరొక వికెట్‌ తీశారు. ఇక తదుపరి మ్యాచ్ మార్చి 9 న ఇంగ్లాడ్ లెజెండ్స్ తో ఆడనుంది ఇండియా లెజెండ్స్.

వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు