Uttarakhand Flood: గల్లంతైన యజమాని కోసం శునకం రోజుల తరబడి ఎదురుచూపులు!

163

Uttarakhand Flood: పెంపుడు జంతువులలో అత్యంత విశ్వాస జీవి శునకం. ప్రాణాలు పోయినా విశ్వాసాన్ని మాత్రం వీడని నైజం ఒక్క కుక్కలకే చెల్లింది. ఇప్పటికే మనం ఇంటర్నెట్లో మనుషుల పట్ల కుక్కల దాతృత్వం.. విశ్వాసం ప్రదర్శించిన శునకాల స్టోరీలను మనం చదివే ఉంటాం. తాజాగా ఉత్తరాఖండ్ వరదలలో ఇలాంటి ఒక ఘటనే ఇప్పుడు అందరినీ కలచివేస్తుంది. ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నదికి ఆకస్మిక వరదలు తలెత్తి 200 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటివరకు 34 మృతదేహాలు వెలికితీయగా భారీ వర్షాలతో సహాయక కార్యక్రమాలకు బ్రేక్ పడింది.

అధికారులు సహాయక కార్యక్రమాలు ఆపినా ఓ కుక్క మాత్రం తన యజమాని కోసం అక్కడే ఎదురుచూస్తూ ఉంది. ఆకస్మిక వరదలలో తపోవన్ హైడ్రల్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతింది. గల్లంతైన వారిలో అత్యధికులు ఈ ప్రాజెక్టుకు చెందిన కార్మికులేనని గుర్తించారు. సహాయక బృందాలు ఓ సొరంగం నుంచి పలువురు కార్మికులను రక్షించగా.. వర్షం కురవడంతో సహాయక చర్యలు ఆపేశారు. సహాయక బృందాలు సొరంగం నుంచి రక్షించిన కార్మికులలో తన యజమాని లేకపోవడంతో శునకం ఒకటి మూడు రోజులుగా ఆ సొరంగం వద్దే ఎదురుచూస్తూ ఉంది.

తపోవన్ ప్రాజెక్టు పరిసరాల్లోనే పుట్టి పెరిగిన బ్లాకీ అనే కుక్కను అక్కడి కార్మికుల్లో ఒకరు పెంచుకుంటున్నాడు. అక్కడే కార్మికుల వద్ద తింటూ బ్లాకీ కూడా పెరిగి పెద్దదైంది. ఇంతలో వరద రావడంతో తనను పెంచుకున్న కార్మికుడు సొరంగంలోనే గల్లంతైపోయాడు. భారీ వర్షంలో సహాయక చర్యల కోసం అధికారులు భారీ యంత్రాలను తీసుకురావడంతో సొరంగం నుంచి ఇవతలికి వచ్చిన శునకం బ్లాకీ.. ఆ ప్రాంతం మాత్రం వీడకుండా సొరంగం వైపు ఆశగా ఎదురుచూస్తుంది. బ్లాకీ ఎదురుచూపులు ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు, కార్మికులను కలచి వేస్తుంది.

Uttarakhand Flood: గల్లంతైన యజమాని కోసం శునకం రోజుల తరబడి ఎదురుచూపులు!