కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

86

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో సుమారు 58.5 లక్షల మందికి లబ్ది జరగనున్నట్టు ఆయతన తెలిపారు.

అలాగే దేశంలో కీలకమైన పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని చెప్పిన మంత్రి రవి శంకర్‌ వీటికి ఎటువంటి లైసెన్స్‌, ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఉండదని తెలిపారు. ఇక దేశంలో పబ్లిక్‌ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు గాను పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌)కి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం లభించింది. దీంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లు వృద్ధి చెందనున్నాయి.

ఇవేకాక కొచ్చి- లక్షద్వీప్‌ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించేందుకు గాను యుఎస్ఓఎఫ్ పధకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.