కంటి నిండా నిద్రలేకుంటే భరించలేని బాధలు

169

శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్ర‌తి ఒక్క వ్య‌క్తి నిత్యం కనీసం ఆరు గంటలకు తక్కువగా నిద్రించకూడదు.. నిద్ర వ‌ల్ల శ‌రీరానికి నూత‌నోత్తేజం తోపాటు కొత్త శ‌క్తి లభిస్తుంది. తగినంత నిద్రపోవడం వలన తరువాతి రోజు ఉత్సాహంగా ప‌నిచేసే శక్తీ ల‌భిస్తుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలామంది సరిగా నిద్ర పోవ‌డం లేదు.. దీనివలన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

ఒక్కరోజు నిద్ర పోక‌పోతే ఏమ‌వుతుందిలే.. అనే భావ‌న‌లో చాలామంది ఉంటారు. కానీ అది సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు‌. ఏ ఒక్క రోజు అవసరమైనన్ని గంటలు నిద్రపోకపోయినట్టయితే దాని ప్ర‌భావం ఆరోగ్యం మీద ప‌డుతుంద‌ట‌. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో క‌ణ‌జాలంపై నిద్ర ప్రభావాన్ని చూపిస్తుందట‌. ఓ ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం వెల్లడైంది. నార్త్ వెస్ట్ర‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ ప‌రిశోధ‌క బృందం క‌ణ‌స్థాయిలో నిద్ర‌లేమి ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న అంశంపై అధ్య‌య‌నం చేసింది.

ఇందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. 15 మంది ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తుల‌పై సైంటిస్టులు ఈ ప‌రిశోధ‌న చేశారు. నిద్రలేమి కారణంగా శ‌రీరంలో కండ‌రాలు బ‌ల‌హీనం అవ‌డం, కొవ్వు స్థాయిలు అధికం కావ‌డం వంటి స‌మ‌స్య‌లు వస్తాయని తేలింది. నిద్ర లేకుండా శ‌రీరంలోని క‌ణ‌జాలంపై ప‌డుతుంద‌ట‌. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తాయని కనుగొన్నారు‌.