బైక్ పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి వ్యాపించిన మంటలు.. ఇద్దరు సజీవదహనం

60

ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన సంగటన అనంతపురం జిల్లాలో జరిగింది. యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన లారీ యజమాని దిద్దేకుంట రోషిరెడ్డి (64), నగరూరుకు చెందిన నారాయణరెడ్డి (40)తో కలిసి ఆదివారం గుత్తి మండలం బాచుపల్లి బాట సుంకులమ్మ ఆలయం జరిగిన జాతరకు తమ ద్విచక్రవాహనంపై వెళ్లి.. కార్యక్రమం ముగిసిన తరువాత భోగాలకట్టకు వస్తున్నారు. అయితే గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామశివారులోని 67వ నంబరు జాతీయరహదారి గుండా వెళుతున్న వారిని మృత్యువు వెంటాడింది..

వారికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అతివేగం కారణంగా బైక్ అదుపులోకి రాకపోవడంతో పాలిష్‌ బండల లోడ్‌తో వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో బైక్‌ ఒక్కసారిగా కిందపడటంతో ఆయిల్ ట్యాంక్‌ పగిలింది.. దాంతో రాపిడికి నిప్పు రవ్వలు రేగడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరుగుతుందని ముందే గ్రహించిన లారీ డ్రైవర్, క్లీనర్‌ కిందకు దూకి పారిపోయారు. అయితే లారీ కింద చిక్కుకున్న రోషిరెడ్డి, నారాయణరెడ్డి మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.