గంపెడు టమాటాల గొడవ.. రెండు ముక్కలైన దేశం.. ఇరవై మంది బలి!

15020

గొడవంటే ఏదో విలువైన వస్తువు కోసమో.. మరేదైనా జీవితం నాశనమయ్యే అంశంలోనో ప్రాణాలకు తెగించిన పోరాటాలు ఇప్పటి వరకు మనం చూశాం. కానీ కేవలం గంపెడు టమాటాలు తెచ్చిన గొడవ ఏకంగా దేశమే రెండు ముక్కలుగా విడిపోయేంత పెద్ద గొడవ కావడం.. రెండు వర్గాలుగా మారిన ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవడం వరకు వెళ్లిందంటే ఆశ్చర్యానికి మించిన ఇంకేదో భావన కలగకమానదు. కానీ ఇదే నిజం. నైజీరియాలో అదే జరిగింది. గంపెడు టమాటాలు రోడ్డు మీద పడిపోవడంతో మొదలైన గొడవ చిలికి చిలికి గాలీవానగా మారి.. చివరికి ఉత్తర దేశం, దక్షణ దేశంగా ప్రజలు విడిపోయి.. మతాలు, సామజిక వర్గాల గ్రూపులుగా ఏకమై ఒకరి మీద మరొకరు దాడులకు దిగే వరకు వచ్చింది. ఈ అల్లర్లు.. దాడులలో ఇప్పటికే ఇరవై మందికి పైగా సామాన్య ప్రజలు చనిపోగా తీవ్ర ఆస్థి నష్టం జరిగింది. అల్లర్లు అదుపు చేయడం కోసం దేశ సరిహద్దు సైనికుల నుండి ప్రభుత్వాధినేతలకు తలకు మించిన భారంగా మారింది.

ఫిబ్రవరి నెలలో ఒక వ్యక్తి టమాటల గంపతో నైజీరియా దేశంలోని నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు టమాటలు రోడ్డుపై పడి అంతటా వ్యాపించాయి. టమాటాలు కాస్త రోడ్డుపై చిందరవందరగా మారడంతో సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లు టమాటాల గంపతో వచ్చిన వ్యక్తితో వాదనకు దిగారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కావడంతో ఆ వ్యక్తి దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వాగ్వాదం కాస్తా పెరిగి పెద్దదై ఘర్షణకు దారితీసి చివరికి వీధి పోరాటంగా మారింది. ఆ పోరాటం కాస్త సోషల్ మీడియా పుణ్యమా అని కొద్ది గంటలలోనే ఉద్యమంగా మారిపోయింది. ఈ టమాటాల ఘటన జరిగిన అనంతరం కేవలం నాలుగు గంటలలోనే వివాదం హింసాత్మక రూపాన్ని సంతరించుకుంది. ఒక వర్గం అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి మరో వర్గానికి చెందిన పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఘర్షణలు మొదలై ఇప్పటికి నెల రోజులు గడుస్తున్నా హింస ఆగడం లేదు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోగా.. అల్లర్ల దెబ్బకు భయాందోళనలతో వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు, భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించి కఠిన ఆంక్షలు విధించి ఇళ్ల నుండి ప్రజలు బయటకు వస్తే కొరఢా ఝళిపిస్తున్నారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాంసానికి అతిపెద్ద మార్కెట్టయిన లాగోస్ లో ఇప్పుడు మాంసం దొరకని పరిస్థితి.

అయితే.. అసలు టమాటాల గంప రోడ్డు మీద పడితే ఇంత రాద్ధాంతం దేనికి.. ఇంత చిన్న వివాదం దేశమే రెండు ముక్కలయ్యేంత ప్రభావం ఎందుకు చూపించింది.. అసలు నైజీరియాలో ఏం జరిగింది అనే అనుమానాలు రాకమానవు. ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా ముస్లిం-క్రైస్తవుల మధ్య సామజిక, మత పరమైన వివాదాలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలోనే టమాటాల గంపతో వెళ్తున్న వ్యక్తి ఒక సామాజిక వర్గమైతే.. అది రోడ్డుపై పడిన స్థలం చుట్టూ ఉన్న దుకాణాలన్నీ మరో సామజిక వర్గానికి చెందినవి కావడం ఇక్కడ గొడవకి బీజం పడింది. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న మతపరమైన వివాదాలు కొన్ని గంటలలోనే సామజిక మాధ్యమాల ద్వారా దావనంలా వ్యాపించి దేశాన్ని చుట్టుముట్టేశాయి. సహజంగానే ఈ దేశంలో ఉత్తరాన ముస్లింలు అధికంగా ఉంటే-దక్షిణాదిన క్రైస్తవులు అధికంగా ఉంటారు. ఈ టమాటాలు తెచ్చిన గొడవలో ఉత్తర ముస్లింలు.. దక్షణ క్రైస్తవులు రెండు వర్గాలుగా మారి ఈ వివాదానికి ఆజ్యం పోశారు.

నైజీరియాలో ఉగ్రవాదం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రెండు వర్గాలలో మత ఛాందస వాదులు తయారై వారేదో వారి వర్గాన్ని ఉద్దరిస్తున్న భావనలో ఉండిపోతున్నారు. అత్యాధునిక ఆయుధాలతో వీళ్ళు అప్పుడప్పుడు రెచ్చిపోతుంటారు. ఒక వర్గంలో రెబల్స్ మరో వర్గంలోని యువతులను బలవంతంగా ఈడ్చుకెళ్లి మత మార్పిడులు చేసి తమ యువకులకిచ్చి వివాహాలు చేసుకుంటే.. మరో వర్గంలోని రెబల్స్ ప్రత్యర్థులకు చెందిన స్కూల్స్ మీద దాడులు చేసి వందల మంది పిల్లలని కిడ్నాప్స్ చేస్తుంటారు. గతంలో కూడా ఈ తరహా కిడ్నాప్స్ ఇక్కడ సంచలనం సృష్టించగా 2014 సంవత్సరంలో పల్లెటూర్ల మీద దాడులు చేసిన టెర్రరిస్టులు నలుగురిని చంపి 91 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా వారిని రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రపంచ దేశాల నుండి ఒత్తిడులు తట్టుకోలేక చివరికి అసలు తమ దేశంలో కిడ్నాప్ జరగనేలేదని ప్రకటనలు చేసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఒకేసారి 317 మంది బాలికలు కిడ్నాప్ కు గురికాగా ప్రభుత్వం నానా కష్టాలు పడి వారిని రక్షించింది. ఈ వివాదాలు చెలరేగుతున్న తరుణంలోనే టమాటాల గంప వివాదం కూడా జరగడం.. ఇది కూడా వివక్ష కారణంగానే జరిగిందని భావించడంతోనే ఈ వివాదం ఇరవై మంది ప్రాణాలను బలి తీసుకొని.. భూభాగం ఒక్కటైనా దేశంలోని ప్రజలను రెండు ముక్కలుగా చేసింది!

గంపెడు టమాటాల గొడవ.. రెండు ముక్కలైన దేశం.. ఇరవై మంది బలి!