బీజేపీపై టీఆర్ఎస్ గాంధేయవాదం.. వెనుక అసలు మర్మమేంటి?

744

తెలంగాణ రాజకీయాలలో విశ్లేషకులు ఊహించింది ఒకటైతే.. ప్రస్తుతం జరుగుతుంది మరొకటి. ముందుగా దుబ్బాక ఎన్నికలు.. తర్వాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. ఈ రెండిటిలో కూడా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నది స్పష్టంగా అర్ధమైన అంశం. గ్రేటర్ ఫలితాల అనంతరం తప్పదు గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇక రెచ్చిపోవడం ఖాయం అనుకున్నారు. బీజేపీపై కత్తి దూసి నేలమట్టం చేస్తారని భావించారు. కానీ వాస్తవంలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఒక్కరే కాదు ఆ పార్టీ నేతలు కూడా సహనంగా ఉంటున్నారు.

ఈ విషయంలో బీజేపీ తీవ్రంగా రెచ్చిపోతుంది. మీటింగ్ ఏదైనా సందర్భం ఏదైనా టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళైతే మరో అడుగు ముందుకేసి కుక్కలు అనే విధంగా సంభోదించారు. ఎవరిని అన్నారు.. ఎందుకు అన్నారు.. సందర్భం ఏంటనేది పక్కన పెడితే బీజేపీ నేతలు ఎంతగా రెచ్చిపోతున్నారన్నది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం గాంధేయ వాదం పుచ్చుకున్నారా అన్నంతగా మౌనంగా ఉండిపోతున్నారు. పార్టీలో ఒకరిద్దరు నోటిదురుసు నేతలు ఉన్నా వాళ్ళని కూడా ఏదో శక్తి అడ్డుకుంటుంది.

టీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నేతలే కాదు హైకమాండ్ పెద్దలు కూడా ఓర్పు, సహనంతో ఉంటున్నామని వాళ్లే మైకుల ముందు చెప్పేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ మధ్యనే నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను జాతి ద్రోహులుగా మాట్లాడిన కేసీఆర్ బీజేపీ నేతలకు హెచ్చరికలు ఇచ్చారు. తామెంతో సహనంగా ఉన్నామని.. రెచ్చగొడితే కబడ్ధార్ అన్నారు. షాడో సీఎం అంటున్న కేటీఆర్ సైతం తాజాగా ఇదే మాట చెప్పారు. తాము రెచ్చిపోగలం.. కానీ రాష్ట్రం కోసం ఓపికగా ఉన్నామని స్పష్టంగానే చెప్పారు.

అయితే.. బీజేపీ నేతలు ఇంతగా రెచ్చిపోతున్నా టీఆర్ఎస్ నేతల గాంధేయవాదం వెనుక అసలు మతలబేంటి అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. మాటకు మాట బదులిచ్చి అనవసరంగా ప్రజల దృష్టిలో బీజేపీని హైలెట్ చేయడం ఇష్టంలేకనే మౌనంగా ఉన్నారా? లేక ఢిల్లీలో సమీకరణాలే గులాబీ నేతల నోళ్ళని కట్టేస్తున్నాయా? అంటూ విశ్లేషకులు ఎవరికి వారు చర్చలు మొదలుపెట్టారు. మాటకి బదులు చెప్పే రోజు దగ్గరలోనే ఉందని కొందరు టీఆర్ఎస్ కిందిస్థాయి నేతలు సన్నిహితుల వద్ద ధీమాగా చెప్తున్నా హైకాండ్ మాత్రం వేచిచూసే ధోరణిలోనే సహనంగా ఉంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ మౌనం ఎన్నాళ్ళో.. అసలు వెనుక కారణం ఏమిటో ఆ పెద్దలకే తెలియాలి!

బీజేపీపై టీఆర్ఎస్ గాంధేయవాదం.. వెనుక అసలు మర్మమేంటి?