తిరుపతి ఉపఎన్నికలో జనసేనే పోటీ చేస్తుందా? క్లారిటీ ఇచ్చేసినట్లేనా?

360

పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒక్కోసారి అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ముందుచూపుతో ఆలోచించి అడుగులు వేస్తారో? తర్వాత ఆలోచిద్దాం ముందు అడుగేద్దాం అని భావిస్తారో? కానీ వేగంగా అడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్.. ఇటీవల జరిగిన GHMC ఎన్నికల్లో ముందుగానే జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. అయితే బీజేపీ పెద్ద నాయకులు కలవడంతో పొత్తులో భాగంగా ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులైతే మాత్రం కాస్త నిరాశకు గురయ్యారు.

అయితే ఆ సమయంలో.. జనసైనికులను శాంతింపజేసేందుకు, ఆ పార్టీ ముఖ్యనాయకులు చెప్పిన మాట ఏమిటంటే.. తిరుపతి ఉపఎన్నిక సమయంలో పొత్తులో భాగంగా మనకే సీటు ఇవ్వాలంటే ఇప్పుడు తగ్గక తప్పట్లేదు అనే మాట.. ఈ క్రమంలోనే GHMC ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద నాయకులను కలిసేసి వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ మీటింగ్‌లో తిరుపతి లోక్‌సభ సీటును బీజేపీకి ఇచ్చేందుకు పవన్ అంగీకరించారంటూ వార్తలు రాగా.. సోము వీర్రాజు లాంటి నాయకులు మేమే పోటీ చేస్తున్నాం అంటూ ప్రకటించడంతో తిరుపతి ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని అనుకున్నారు. సోము వీర్రాజు ప్రకటనపై జనసేన వైపు నుంచి కూడా స్పందన లేకపోవడమే ఇందుకు కారణం.

కానీ, ఇప్పుడు సడెన్‌గా తిరుపతి విషయంలో జనసేననే పోటీ చేస్తుంది అన్నట్లుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తిరుపతి లోక్‌సభ పరిధిలో జనసేన కార్యనిర్వాహక కమిటీని ప్రకటించడం.. కమిటీ సభ్యులుగా డా.పి.హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, రాందాస్ చౌదరి, కిరణ్ రాయల్, శ్రీమతి వినుత, పొన్న యుగంధర్, ఉయ్యాల ప్రవీణ్, తీగల చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వర్లు, కంటేపల్లి ప్రసాద్‌లను నియమిండంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చేశారు.

హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయుకుండా వెనక్కి తగ్గిన తర్వాత ఇప్పుడు తిరుపతిలో పవన్ కళ్యాణ్.. మొహమాటాన్ని వదిలేసినట్లేనని పోటీకి సై అంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. తామే పోటీ చేస్తామని బీజేపీ మద్దతు మాత్రమే ఇస్తుందని ప్రచారానికి సిద్ధం అవ్వాలని జనసైనికులు అంటున్నారు. అయితే జనసేన నుంచి బరిలోకి ఎవరు దిగుతారు అనేది మాత్రం ఇంకా బయటకు రావట్లేదు.. SC నియోజకవర్గం కావడంతో సరైన నాయకుల కోసం కూడా జనసేన అన్వేషిస్తుంది.

2019ఎలక్షన్‌లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకి జనసేన దూరంగా ఉండగా.. పొత్తులో భాగంగా BSPకి పోటీ చేసే అవకాశం ఇచ్చింది జనసేన. BSP తరపున దగ్గుమాటి శ్రీహరిరావు పోటీ చేయగా.. BJP తరపున బొమ్మి శ్రీహరిరావు పోటీ చేశారు. ఇక్కడ బీజేపీకి, బీఎస్‌పీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ‘నోటా’కు 25వేల 781ఓట్లు రాగా.. BSPకి 20వేల 971ఓట్లు.. BJPకి 16వేల 125ఓట్లు వచ్చాయి.

తిరుపతి ఉపఎన్నికలో జనసేనే పోటీ చేస్తుందా? క్లారిటీ ఇచ్చేసినట్లేనా?