పోలీసుల కస్టడీలో మూడేళ్ళ బాలిక మృతి

48

కర్ణాటక కల్బుర్గీలో దారుణం జరిగింది. కస్టడీలో ఉన్న మూడేళ్ళ చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే జనెగి పరిధిలో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఆమె తల్లిని పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆమెతోపాటు మూడేళ్ళ కూతురు కూడా స్టేషన్ కి వచ్చింది. అయితే తన కూతురు ఆరోగ్యపరిస్థితి బాలేదని ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సదరు మహిళ పోలీసులను కోరింది. అయితే పోలీసులు ఆమెను బయటికి పంపేందుకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. పాప ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలుస్తుంది.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిని సస్పెండ్ చేసి మృతురాలి తల్లికి న్యాయం చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. బాలిక ఆరోగ్యపరిస్థితి సరిగా లేదని తెలియగానే తాము ఆసుపత్రికి పంపమని అంతలోనే మృతి చెందిందని అంటున్నారు.

ఈ ఉదంతంపై కల్బుర్గీ ఎస్పీ సిమీ మరియమ్ జార్జ్ మాట్లాడుతూ ఒక ఘటనలో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నామని, ఆమెను జెవర్గీ పోలీస్‌స్టేషన్‌లో కుమార్తెతో పాటు ఉంచామన్నారు. అయితే ఆమె కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రికి పంపించామని, అక్కడి వైద్యులు ఆ బాలిక అప్పటికే మృతి చెందిందని తెలిపారన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడతామని తెలిపారు పోలీస్ అధికారులు.

పోలీసుల కస్టడీలో మూడేళ్ళ బాలిక మృతి