కొత్త వైరస్ స్ట్రెయిన్.. నిర్లక్షం వహిస్తే ముప్పు తప్పదు!

14987

కరోనా వైరస్.. ఈ పేరు చెప్తే మానవాళి వెన్నులో వణుకుపుట్టడం ఖాయం. ఇప్పుడంటే జనాలలో కాస్త ఆ బెరుకు తగ్గింది కానీ నాలుగైదు నెలల ముందు కోవిడ్ పేరు చెప్తే ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీసిన రోజులు గుర్తొస్తాయి. కళ్ళ ముందు మనిషి గిలగిలా కొట్టుకు చస్తున్నా దగ్గరకు వెళ్తే ప్రాణం పోతుందనే కర్కశత్వాన్ని కళ్ళకు చూపించిన ఘనత కరోనా వైరస్ సొంతం. ఆకలితో అలమటించి రాలిపోయిన ప్రాణాలు.. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడిన మధ్యతరగతి బతుకులు.. ప్రాణం దక్కితే చాలని వందల కిలోమీటర్లు నడిచిన బాటసారులు.. ఇలా ఒక్కటేమిటీ.. మహమ్మారి మిగిల్చిన గుర్తులు.. కనిపించిన చిత్రాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. మనిషంటేనే చెడును మరిచి బతుకు పోరులో సరికొత్త మార్గాలను అన్వేషించడమే కనుక త్వరగానే మహమ్మారిని తనలో భాగం చేసుకున్నాడు. మరోవైపు నిద్రాహారాలు మాని.. మానవాళిని రక్షించడమే తన బాద్యతగా వారి కర్తవ్యాలను నెరవేర్చిన నిపుణుల ప్రయోగాలు ఫలించి మహమ్మారికి టీకా అందుబాటులోకి వస్తుండడంతో మనిషి జీవితం మళ్ళీ ఆశాజనకంగా మారిపోయింది.

అయితే.. అంత సులభంగా మనల్ని వదిలితే అది మహమ్మారి అని ఎందుకంటారు. మానవ దేహం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటే.. వైరస్ కొత్తరూపాంతరం చెంది పండగ విప్పేందుకు సిద్దమవుతుంది. దాని పేరే యూకే వైరస్ స్ట్రెయిన్. గత ఏడాది సెప్టెంబర్ లో బ్రిటన్‌లో కనుగొన్న ఈ యూకే వేరియంట్ అక్కడ వేగంగా వ్యాపిస్తోంది. కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లో అనేక ఉత్పరివర్తనాలు చెందగా వీటిల్లో బీ.1.1.7 వైరస్ స్ట్రెయిన్ తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్తరకం కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. పాత కరోనా వైరస్ తో పోలిస్తే యూకే వేరియంట్ 30 నుంచి 100 శాతం ప్రాణాంతకమని పరిశోధకులు గుర్తించారు. ఎక్సెటర్ యూనివర్సిటీ, బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించగా.. దీన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.

కరోనా వైరస్ అంటేనే మనిషి నుండి మనిషికి వేగంగా వ్యాపిస్తుందని ఏడాదిగా మనం వింటూనే ఉన్నాం. అయితే.. కొత్త వేరియంట్ అంతకంటే వేగంగా వ్యాపిస్తుందని షాకింగ్ నిజాన్ని వారు వెల్లడించారు. కొత్త వైరస్ స్ట్రెయిన్ అంత వేగంగా వ్యాప్తి చెందుతుంది కనుకే ఇప్పటికే 100 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం చూస్తే.. కొత్త యూకే వైరస్ స్ట్రెయిన్ మరణాలలోనూ ముందుంది. పాత వైరస్, కొత్త స్ట్రెయిన్ సోకిన వారిలో మరణాల శాతాన్ని పోల్చి చూసిన నిపుణులు ఇది ముప్పై నుండి వంద శాతం వరకు అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు. నవంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య పాత, కొత్త వైరస్ వేరియంట్లు వ్యాపించగా కరోనా వైరస్ వేగంగా రూపాన్ని మార్చుకుంటోందని అధ్యయన బృంద సభ్యుడు లియాన్ డానోన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు వైద్యశాస్త్ర నిపుణులు అష్టకష్టాలకోర్చి కనుగొన్న వ్యాక్సిన్లను కూడా తట్టుకునేలా ఈ కొత్త వేరియంట్లు సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉందని లియాన్ చెబుతున్నారు.

పాత వైరస్, యూకే వేరియంట్ మాత్రమే కాదు భవిష్యత్ లో మరికొన్ని కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం ఉండగా వాటిని గుర్తించేందుకు విస్తృతంగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతకంతకు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యంతో పుట్టుకొచ్చే ఈ వేరియంట్ల పట్ల ప్రజలు, ప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తే రానున్న రోజుల్లో ఇది తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పలు దేశాలను గడగడలాడిస్తున్న యూకే వేరియంట్ తో సౌత్ ఆఫ్రికా రకం వైరస్‌ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిటన్‌ , సౌతాఫ్రికాలో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. భవిష్యత్తులో ఇంకెన్ని వేరియంట్లు పుట్టుకొస్తాయో.. మరెన్ని రూపాంతరాలు చెందుతుందో చూడాల్సి ఉంది!

కొత్త వైరస్ స్ట్రెయిన్.. నిర్లక్షం వహిస్తే ముప్పు తప్పదు!