శుభకార్యాల్లో దొంగ బంధువులు.. తస్మా జాగ్రత్త

175

శుభకార్యాల్లో దొంగల బెడద ఎక్కువవుతుంది. ఈ మధ్య వెలుగు చూస్తున్న దొంగతనాల కేసులలో శుభకార్యాల్లో జరిగినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వేడుకల్లో దొంగల చేతివాటం ఎక్కువైంది. దింతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఓ దొంగతనం వివరాలను పోలీసులు వెల్లడించారు.

బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగదును కాజేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మధ్యప్రదేశ్‌ రాజ్‌ఘడ్‌ జిల్లాకు చెందిన ప్రశాంత్‌(22), శ్రావణ్‌(21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు. కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరై.. శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను దొంగిలించి అక్కడి నుంచి ఉడాయించేవారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందు తమ వెంట ఉన్న ఆరేళ్ళ చిన్నారితో దొంగతనం చేయించేవారు. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫిబ్రవరి నెల మూడవ వారంలో జరిగిన ఓ వేడుకకు వెళ్లిన ఈ గ్యాంగ్.. స్టేజిపై ఉన్న ఓ బ్యాగ్ ను బ్యాగ్ ని తీసుకోని ఉడాయించారు. అన్నం తినేందుకు వెళ్లిన మహిళ వచ్చేసరికి తన బ్యాగ్ కనిపించకపోవడంతో కంగారు పడి చుట్టుపక్క వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో వీడియో గ్రాఫర్ వద్దకు వెళ్లి.. అప్పటివరకు తీసిన వీడియోను పరిశీలించింది. ఓ చిన్న బాలిక బ్యాగ్ తీసుకెళ్లిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇందులో విలువైన ఆభరణాలతోపాటు నగదు కూడా ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఎస్ఓటీ సహాయంతో వీరిని పట్టుకొని గురువారం రిమాండ్ కు తరలించారు. వీరివద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటివే మరికొన్ని గ్యాంగ్స్ వేడుకల్లో తిరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వేడుకకు తెలియని వారు వస్తే వారిపై ఓ కన్నేసి ఉంచాలని తెలిపారు. ఫంక్షన్ హాల్స్ లోకూడా సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలని పోలీసులు ఆదేశించారు.

శుభకార్యాల్లో దొంగ బంధువులు.. తస్మా జాగ్రత్త