జాత్యహంకారం చెల్లించిన మూల్యం.. జార్జ్ కుటుంబానికి రూ.200 కోట్లు!

14840

ఈ ప్రపంచంలో దేశానికో జాడ్యం పట్టిపీడిస్తోంది. అభివృద్ధి చెందిన దేశం.. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అమెరికాలో జాత్యహంకారం రేపిన ఉద్యమాలు యావత్ దేశాన్నే కుదిపేసిన ఘటనలున్నాయి. అంతకుమించి ప్రపంచం దృష్టిలో పరువు తీసిన సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. గతేడాది మిన్నియాపోలీసు నగరంలో శ్వేతజాతి పోలీసు అధికారి.. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా మోకాలితో గొంతు నొక్కి పట్టి చంపేయడం. గత ఏడాది మే నెలలో జరిగిన ఈ ఘటన అమెరికాలో తీవ్ర వర్ణ విభేదాలను రేకెత్తించి ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడేలా చేసింది. తెల్లజాతి పోలీస్ అధికారి జార్జ్ ప్లాయిడ్ ను చంపడం ఓ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేశం ఆగ్రహ జ్వాలల మధ్య అట్టుడికిపోయింది. దాదాపు పదినెలలుగా జార్జ్ కుటుంబం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఫైనల్ గా ఇప్పుడు జాత్యహంకారం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పోలీసు చేతుల్లో చనిపోయిన జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్ల పరిహారం చెల్లిస్తామని అమెరికాలోని మినిపోలిస్ నగరం ప్రకటించింది. జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి నష్ట పరిహారంగా చెల్లించనున్నట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించగా.. ఈ సమాచారాన్ని మిన్నెసొటా నగర అడ్వకేట్లు ఫ్లాయిడ్ కుటుంబానికి తెలిపారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద ప్రీ ట్రయల్ సెటిల్ మెంట్ అని అడ్వకేట్లు పేర్కొన్నారు.

అయితే అసలు ఎవరీ జార్జ్ ప్లాయిడ్.. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోవాలి అనుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే.. సాధారణ కుటుంబానికి చెందిన 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ ఒకనాడు క్రిమినల్‌. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యాడు. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక మంచి మనిషిగా మారాలని భావించిన జార్జ్‌.. మత సంస్థ అయిన రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరాడు. క్రైస్తవ మిషనరీ సెక్యూరిటీ గార్డుగా, లారీ డ్రైవర్‌గా, క్లబ్‌లో బౌన్సర్‌గా దొరికిన పని పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జార్జ్ మరణానికి ఒక కారణమైంది. కరోనా సంక్షోభం కారణంగా వ్యాపారాలు దెబ్బతిని.. చేసేందుకు పనిలేక.. తినేందుకు తిండిలేక ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది అమెరికన్లలాగానే ఫ్లాయిడ్‌ కూడా ఇబ్బందుల్లో పడడంతో 20 డాలర్ల నకిలీ నోటు చెలామణి చేసి సిగరెట్లు కొనడానికి ప్రయత్నించాడు. అయితే.. ఫ్లాయిడ్ పాత రికార్డును దృష్టిలో ఉంచుకుని పోలీస్ అతడితో అమానుషంగా వ్యవహరించి చివరికి అతడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు

గతేడాది మే 25న జార్జ్ ప్లాయిడ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీసు డెరెక్ చౌవిన్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. అమెరికాలో సాధారణ పౌరుల పట్ల ఎలా వ్యవహరించాలో ఇక్కడి పోలీసులకు కొన్ని నియమాలుంటాయి. కానీ పోలీసు డెరెక్ వాటిని అధిగమించి ఒక తీవ్రవాది పట్ల వ్యవహరించే తీరుగా జార్జ్ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. అతన్ని కిందపడేసి మెడపై తన మోకాలితో చాలాసేపు నొక్కొపట్టడం మూలంగా జార్జ్ ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో జార్జ్ ఊపిరి ఆడడం లేదని అరిచినా.. డెరెక్ కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈ ఘటనను అక్కడున్నవారు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటనపై అమెరికాలో నల్లజాతీయులు ఉద్యమాన్ని లేవనెత్తగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ ఘటనలో నలుగురు పోలీసులను ప్రభుత్వం విధుల నుంచి తప్పించగా.. బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌ పేరుతో ఉద్యమకారులు ఆందోళనలు హింసాత్మకంగా రూపాంతరం చెందాయి. రెండవ రోజుకు ఇది వేలమందితో.. మూడవరోజుకి లక్షల మందితో నడిచే ఉద్యమంగా మారింది. అసలే కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యానికి ఈ వర్ణ ఉద్యమంతో ఊపిరాడనంత పనైంది. ప్రపంచవ్యాప్తంగా మనిషి వర్ణాన్ని ప్రేరేపితం చేసే ఉత్పత్తుల ప్రకటనలు కూడా తమ స్వభావాన్ని మార్చుకునేలా ఈ ఉద్యమం ప్రభావితం చేసింది. ఈ ఘటనపై జార్జ్ కుటుంబ సభ్యులు గత ఏడాది జూలైలో మిన్నెసొటా కోర్టులో పిటీషన్ వేశారు.

ఆనాటి నుండి జార్జి కుటుంబాన్ని రాజీ దిశగా రాబట్టేందుకు మిన్నియా పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు. మొత్తంగా కోర్టు బయట పరిష్కరించుకుందామని చెప్పి పోలీసులు ఫ్లాయిడ్ కుటుంబాన్ని ఒప్పించారు. చివరికి భారీ మొత్తంలో నగదు పరిహారాన్ని చెల్లించే విధంగా సెటిల్ మెంట్ చేసుకుంది. ఈ ఘటనలో ఇరు వర్గాల అంగీకారం మేరకు 2.7 కోట్ల డాలర్లు నష్టపోయిన జార్జ్ కుటుంబానికి దక్కనుంది. అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపుగా రూ.196 కోట్లు నష్ట పరిహారం పోలీసులు, మిన్నియాపాలిస్ నగరపాలక సంస్థ చెల్లించనున్నారు. జార్జ్ మరణంతో అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడని జాత్యహంకార ఉద్యమాన్ని చూస్తే.. ఇప్పుడు అమెరికా చరిత్రలో అతిపెద్ద ప్రీ ట్రయల్ సెటిల్ మెంట్ చూడాల్సి వచ్చింది. అమెరికాలో జాత్యహంకారం జార్జ్ తోనే మొదలు కాలేదు.. జార్జ్ తోనే అంతం కాలేదు. అంతకుముందు పదులసంఖ్యలో ఇలాంటి ఘటనలు జరగగా.. జార్జ్ మరణంపై ఉద్యమాలు జరుగుతుండగానే.. ఏకంగా ఆనాటి దేశాధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ నల్లజాతి వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలిగా పనికిరారని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే.. జార్జ్ కుటుంబం మాత్రం పోలీసులపై పోరాడి తెల్ల జాతీయుల జాత్యంకారానికి ఒక గుణపాఠాన్ని లిఖించారు.

జాత్యహంకారం చెల్లించిన మూల్యం.. జార్జ్ కుటుంబానికి రూ.200 కోట్లు!