Guntur News: కన్న తల్లిని గొంతునులిమి చంపేసిన కూతురు!

347

Guntur News: మద్యం మత్తు.. క్షణికావేశం కలిసి మానవ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. కన్న తల్లిని కడతేర్చిన కొడుకులు.. వ్యసనాలకు బానిసైన కుమారులను చంపిన తల్లులను ఇప్పటి వరకు మనం అప్పుడప్పుడు వార్తలలో విన్నాం. కానీ ఓ మహిళ వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో.. ఆవేశంలో తల్లినే కడతేర్చడం స్థానికులను షాక్ కు గురిచేసింది. ఇది కూడా ఎక్కడో కాదు ఏపీలోని గుంటూరు జిల్లాలోనే. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన రమాదేవి అనే మహిళ కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యింది.

రమాదేవి అలవాటు చెడు తిరుగుళ్లతో ఆమె కుటుంబం ఎంతగానో మందలించింది. ఎంతకీ వినకపోవడంతో కుటుంబం పట్టించుకోవడమే మానేశారు. ఈ క్రమంలోనే రమాదేవి అనారోగ్యానికి గురైంది. ఆమెకి ఏడేళ్ల కుమారుడు రాహుల్ కూడా ఉండడంతో చూసుకోవడం రమాదేవికి భారమవడంతో ఆమె తల్లి భూలక్ష్మి రమాదేవి వద్దే ఉంటోంది. కుమార్తె రమాదేవితో పాటు.. ఏడేళ్ల వయసున్న మనవడు రాహుల్ ​బాగోగులు భూలక్ష్మి దగ్గరుండి చూసుకుంటోంది. ఈ క్రమంలో రాహుల్ అన్నం తినకుండా మారాం చేశాడని మనవడిని భూలక్ష్మి ఒక దెబ్బ కొట్టడంతో ఏడుస్తూ బయటకి వెళ్ళాడు.

అప్పుడే ఇంటికి వచ్చిన రమాదేవి ఎందుకు ఏడుస్తున్నావని కుమారుడిని అడగ్గా.. అమ్మమ్మ కొట్టిందని చెప్పాడు. కోపంతో రగిలిపోయిన రమాదేవి క్షణికావేశంలో తల్లి గొంతు నులిమి మంచం మీదకు పడవేసి విచక్షణా రహితంగా దాడి చేసింది. ఆ తరువాత ఆమెను ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లింది. ఈ క్రమంలో గమనించిన స్థానికులు భూలక్ష్మిని జీజీహెచ్​కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు. భూలక్ష్మి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Guntur News: కన్న తల్లిని గొంతునులిమి చంపేసిన కూతురు!