సెల్ ఫోన్ ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కూతురు!

85

మనుషులు కనిపెట్టిన టెక్నాలజీ ఇప్పుడు మనుషులను బలితీసుకుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారిపోతున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఎలక్ట్రానిక్ తెరలకు తలలు అప్పగించేసి బ్రతుకుతున్నారు. ఇక పిచ్చి పరాకాష్టకు చేరిన వాళ్ళు వాటి మాయలో పడి ప్రాణాలు తీసుకుంటుంటే ఓ మహాతల్లి మాత్రం సెల్ ఫోన్ ఇవ్వలేదని ఏకంగా తండ్రినే హత్యచేసింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 24న ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగింది. కాంచన్పూర్ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్ధనుకర్(58) కూతురు పేరు దివ్య సరస్వతి. ఆమెకు పెళ్లి కూడా కాగా ఇటీవలే ఆమె భర్త సరస్వతిని తల్లిదండ్రుల దగ్గరకి పంపించాడు. పుట్టింటికి వచ్చిన సరస్వతి తన ఫోన్ కనిపించడం లేదని తండ్రి మాంగ్లును వాకబు చేసింది. అందుకు తండ్రి కూడా తనకు తెలియదని సమాధానమిచ్చాడు. కానీ.. తండ్రిపైనే అనుమానపడిన కూతురు గట్టిగా నిలదీయడంతో అయన కూడా తానే సెల్ ఫోన్ దాచిపెట్టినట్లుగా ఒప్పుకున్నాడు.

తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకున్నందుకే ఫోన్ దాచినట్లు తెలిపిన తండ్రి తమతో ఉన్నన్ని రోజులు సెల్ ఫోన్ లేకుండా ఉండాలని చెప్పడంతో కూతురు ఆగ్రహించి తండ్రి మీద తిరగబడింది. అయినా తండ్రి ఎంతకీ ఫోన్ ఇవ్వకపోవడంతో కర్రతో కొట్టి, రాయితో బాది తండ్రిని హతమార్చింది. ఆపై శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టగా.. అందుకు ఆమె తల్లి కూడా సహకరించింది. ఈ ఘటనను పక్కింటివారు చూసి సమాచారమివ్వడంతో పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సెల్ ఫోన్ ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిన కూతురు!