వాట్స్ యాప్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

166

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే కొత్త ప్రైవేసీ పాలసీని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సీఈవో విల్ కాత్ కార్ట్ కు లేఖ రాసింది. కాగా తాజాగా వాట్సాప్ పలు నిబంధనలు పెట్టింది. మా కొత్త పాలసీని అంగీకరించండి లేదంటే వైదొలగండి అంటూ అహంకారపూరిత సందేశం ఇచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఘాటు లేఖ రాసింది.

దేశ ప్రజల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని వాట్సాప్ సీఈవోకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017) కేసును ప్రస్తావించింది. ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలని ఈ తీర్పు స్పష్టంగా చెప్పిందని, దానిని మీరు గమనించాలని వాట్సాప్‌కు స్పష్టం చేసింది. అయితే విదేశాలనుంచి ఈ యాప్ వచ్చినా అది భారత చట్టాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

కాదు కూడదు అంటే దానిని బ్యాన్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది యాప్ అయిన లేదంటే ఏదైనా కంపెనీ పెట్టుబడులైన భారత చట్టాలకు అనుగుణంగానే ఇక్క వ్యవహరించాల్సి ఉంటుంది. కాగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నారని, ఇప్పుడీ రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది.

ఇక వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర యాప్స్ కోసం సోదించారు. దింతో కొత్త ఆన్లైన్ మెసెంజర్ యాప్స్ తెరపైకి వచ్చాయి. దీనిని గమనించిన వాట్సాప్ తన నిర్ణయాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేసింది. అయితే వాయిదా కాదు పూర్తిగా రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు భారతీయులు.

వాట్స్ యాప్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్రం