YS Sharmila: జగనన్న వదిలిన బాణం.. ఆయనకు లాభమా.. నష్టమా?

369

YS Sharmila: వైఎస్ షర్మిల.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వినిపించిన పేరు. మొన్నటి వరకు అన్న చాటు కూచిగానే కనిపించిన షర్మిల ఇప్పుడు ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చారు. అది కూడా తన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు అనే అంశంతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్నారు. గత రెండు వారాలుగా మొదలైన ఈ ప్రచారం చివరికి నిజమేనని తేలడంతో షర్మిల పార్టీపై లెక్కలు మొదలయ్యాయి. అసలు పార్టీ పుట్టుక ఎందుకోసం.. వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి?.. షర్మిల పార్టీ వెనుక శక్తులు ఉన్నాయా? ఈ కొత్త పార్టీతో ఎవరికి నష్టం ఇలా విశ్లేషణలు సాగిపోతున్నాయి.

నిజానికి మాజీ సీఎం వైఎస్ బ్రతికున్నంత కాలం షర్మిల ఎక్కడా రాజకీయ కార్యక్రమాలలో కనిపించనేలేదు. ఆ మాటకొస్తే జగన్ పొలిటికల్ యాక్టివ్ కూడా చాలా పరిమితంగానే ఉండేది. అయితే.. వైఎస్ మరణం తర్వాత భార్య, కుమారుడుతో పాటు కుమార్తెగా షర్మిల కూడా రాజకీయాలలో ఓనమాలు మొదలుపెట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉంటే.. జగనన్న వదిలిన బాణంగా తన బాధ్యతను భుజాన వేసుకొని అన్న పాదయాత్రను చెల్లి నడిచారు.. నడిపించారు. ప్రజలలో పార్టీపై పట్టు కోల్పోకుండా.. కార్యకర్తలలో ఒక ధీమా దక్కిదంటే అందులో షర్మిల వాటా తప్పక ఉంటుంది.

అయితే.. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అన్న వద్దని వారించినా వినకుండా షర్మిల తెలంగాణలో కొత్తపార్టీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుంది?.. అన్న వద్దన్నా చెల్లి పార్టీ పెట్టడం వెనుక అసలు కారణాలేంటి అనే ఆసక్తి సహజంగానే మొదలైంది. షర్మిల లోటస్ పాండ్ లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం పెడితే ఒక్క జగన్ సొంత మీడియా తప్ప మిగతా అన్ని మీడియా సంస్థలు కవర్ చేశాయి. జగన్ సంస్థ మీడియా ప్రతినిధులు ఎప్పుడు లోటస్ పాండ్ కు అనుసంధానంగానే ఉంటారు. కానీ షర్మిల సమావేశం మాత్రం లైవ్ కవర్ చేయనేలదు. పత్రికలో జస్ట్ ఏదో ఉందంటే ఉందని అన్నట్లుగానే ఉండగా.. అది కూడా ఫ్యామిలీలో గొడవలు లేవని చెప్పేందుకే ప్రాధాన్యత ఇచ్చారు.

షర్మిల పార్టీపై మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి, జగన్ ఆప్తుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో ఆచితూచి నర్మగర్భంగా మాట్లాడారు. అందులో అన్న-చెల్లెళ్ళ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని.. తెలంగాణలో వైసీపీ ఉండబోదనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కానీ తమకు షర్మిల పార్టీతో సంబంధం లేదని ఇంకా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక షర్మిల కూడా ఎక్కడా జగన్ ఫోటో కానీ.. అయన పేరును కానీ వాడుకొనే ప్రయత్నం చేయలేదు. కేవలం తండ్రి పాలనను.. పేరును మాత్రం ఓన్ చేసుకొనే ప్రయత్నం చేశారు.

ఇక.. షర్మిల మీడియాతో మాట్లాడిన సమయంలో మాట్లాడిన మాటలు కొన్ని నిశితంగా పరిశీలిస్తే ఆసక్తికరంగా అనిపించకమానవు. రాజన్న రాజ్యం తెస్తానని.. అది కూడా కేవలం తనతోనే సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో జగన్ పార్టీ నేతలు చెప్పుకొనేది తమది రాజన్న రాజ్యమనే. కానీ షర్మిల అది తనతోనే సాధ్యమని చెప్పారు. అది తెలంగాణ వరకు అనుకోని సైలెంట్ అయినా.. తెలంగాణలో ఎలాగూ వైసీపీ ఉండబోదు కనుక షర్మిలకు మద్దతు ఇచ్చేందుకు వైసీపీ ఎందుకు సిద్ధంగా లేదన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

అంతేకాదు.. షర్మిల వ్యవహారంలో వైసీపీ ఓన్ చేసుకోలేని పక్షంలో అది ఏపీలో భిన్న సంకేతాలు తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అన్న మీద కోపంతోనే చెల్లి వేరే పార్టీ పెట్టుకున్నారని.. పొరుగు రాష్ట్రంలో సొంత చెల్లి పార్టీ పెట్టి కష్టాలు పడుతున్నా కనీసం అండగా లేరనే మాటలు సీఎం జగన్ మీద పడతాయన్నది కాదనలేని నిజం. మరి ఈ పరిస్థితులను జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉండగా.. షర్మిల రాజకీయాలలో జస్ట్ ఇది అరంగేట్రం మాత్రమే కనుక రోజులు గడిస్తే కానీ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

జగనన్న వదిలిన బాణం.. ఆయనకు లాభమా.. నష్టమా?