ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత.. నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన!

456

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం ఉద్రిక్తతగా మారింది. టీడీపీ అధినేత జిల్లా పర్యటనకు వెళ్లడం పోలీసులు పర్యటనను అడ్డుకోవడం.. చంద్రబాబును విమానాశ్రయంలోనే పోలీసులు చుట్టముట్టడం.. ఎక్కడిక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితిలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. అరగంటకు పైగా చంద్రబాబు పోలీసుల మధ్య ఎయిర్ పోర్టులోనే వాగ్వాదం జరిగింది. అధినేతకు స్వాగతం పలికేందుకు అప్పటికే పెద్దఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు రేణిగుంట చేరుకోగా విమానాశ్రయం వద్ద ఆంక్షలు విధించిన పోలీసులు ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు.

మరోవైపు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని.. కార్యకర్తలు ఆయన్ను కలవడానికి లేదని రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుండి అనుమతి తీసుకున్నట్లుగా చంద్రబాబు వెల్లడించగా.. ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు… చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం చెప్పారు.

పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే చంద్రబాబును అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నేడు చంద్రబాబు చిత్తూరు, పుత్తూరు, తిరుపతి గాంధీ విగ్రహాల వద్ద నిరసన చేపట్టేందుకు చిత్తూరు వెళ్లారు. అయితే చంద్రబాబునాయుడు పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరించి విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతుండగా ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే అధికారం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి లభించినా పోలీసులు కక్ష్యపూరితంగా అడ్డుకోవడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిఉంది.

ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత.. నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన!