Telangana State Budget: కసరత్తులు మొదలు.. ప్రతిపైసా లెక్కే!

219

Telangana State Budget: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్టుకు కసరత్తులు ముమ్మరం చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా అధికారులతో భేటీ అవుతూ.. బడ్జెట్ లెక్కలను తీసుకుంటున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ముందు ఎన్నోసవాళ్లు ఉన్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు నాశనమైన రంగాలు.. కోల్పోయిన ఉపాధికి మరమత్తులు చేసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రమంలోనే ఈ బడ్జెట్టుపై ఆసక్తి నెలకొంది.

ఆదాయ అంచనాలను చేరుకోని పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుండడం ఇప్పుడు ఆర్ధిక నిపుణులకు ఆసక్తిగా మారింది. జనవరి నెలాఖరు వరకు చూస్తే రాష్ట్ర రెవెన్యూ అంచనాలను 52 శాతాన్ని మాత్రమే చేరుకొంది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం అంచనాల్లో 6‌0 శాతానికి లోబడే ఉంది. ఒక్క ఎక్సైజ్ ఆదాయం మాత్రమే 70 శాతాన్ని దాటింది. ఈ ఏడాది అప్పులపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. వచ్చే ఏడాది కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పుల అవకాశం, సొంత నిధుల అంచనా ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

కొవిడ్‌, లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాల్లో ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2020-21 బడ్జెట్ అంచనాలు చూస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జనవరి నెలాఖరు వరకు 60శాతంలోపే ఉంది. లక్షా రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే కేవలం 60వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఎక్సైజ్‌ పన్ను ఆదాయం మాత్రమే 71 శాతం అంచనాలను అందుకొంది. 16 వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. జనవరి నెలాఖరు వరకు 11 వేల 443 కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాకు జమ అయింది. ఈ ఒక్క ఎక్సైజ్ తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు. మరి ఈ పరిస్థితిలో ఈ బడ్జెట్ పద్దు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.