తెలంగాణ మంత్రే స్పందిస్తే.. ఆంధ్రా హీరోల మౌనమేంటి?

15237

విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కార్మికసంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ఎందరో ప్రాణత్యాగ ఫలితంగా సిద్దించిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పుడు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే చూస్తుండాలా అని సుందర నగరంలో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రకటనలు.. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిన తీరుతో కాస్త ఓర్పుతో ఉన్న ఉక్కు కార్మికులు లోక్ సభలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతో కేంద్రం వెనక్కు తగ్గేలా లేదని అవగతం చేసుకున్నారు. ఇక చావో రేవో కొట్లాడైనా ఉక్కు కర్మాగారాన్ని దక్కించుకోవాలని కార్మికులు భావించడంతో సోమవారం నుండి ఉక్కు ఉద్యమం రూపు మారింది. కాస్త ఉద్రిక్తతలు.. మరికాస్త ఆగ్రహాలతో ఉక్కు ఉద్యమం ఉక్కు సంకల్పంతో కొత్త రూపు సంతరించుకుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్ప.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే అన్ని పార్టీలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా పొరుగు రాష్ట్రాల నేతలు సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణ మంత్రి.. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ సైతం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్ అవసరమైతే విశాఖకు వెళ్లి మరీ నిరసనలు తెలుపుతామని కూడా చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా నేతలే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ తెలంగాణ నేతలే ఆంధ్రుల ఉద్యమానికి జైకొట్టారు. కానీ ఆనాటి కాలంలో మన సినీ సెలబ్రిటీలు రెండు ప్రాంతాలు రెండు కళ్ళతో సమానమని సిద్ధాంతాన్ని చెప్పుకొనేవారు. విశాఖ ఉక్కు ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెలుగు సినీ హీరోలు, నటీనటులపై దృష్టి పడింది. ఆంధ్రాలో ఇంత జరుగుతున్నా తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న నటులు కనీసం నైతిక మద్దతు ప్రకటించలేరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.

తెలుగు ఇండస్ట్రీలో యువహీరో.. నారా చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ తొలినుండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో కేంద్ర నిర్ణయాన్ని దుయ్యబడుతూనే ఉన్నారు. ఇక బుధవారం మెగాస్టార్ చిరంజీవి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకున్న చిరు.. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయని.. 35 మంది ప్రాణార్పణ ఘటన ఇంకా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని కాస్త ఉద్వేగంతో ట్వీట్లు చేశారు. దీంతో ఇప్పుడు సహజంగానే మిగతా మెగా హీరోల మాటేమిటి అనే అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్.. ఆయన రాజకీయ పార్టీ జనసేన ఇప్పటికే బీజేపీతో దోస్తీ కట్టడంతో విశాఖ ఉక్కు అంశంపై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇక సినీ ఇండస్ట్రీలో మిగతా హీరోల మాటేమిటి?

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా మన హీరోలు మౌనంగానే ఉన్నారు. రైతు ఉద్యమం నడుస్తుంది ఉత్తరాదిన కనుకే మౌనంగా ఉన్నారని ఆయా హీరోల అభిమాన సంఘాలు ఆనాడు నచ్చజెప్పుకున్నాయి. ఏడాది కాలంగా అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కినా.. ఒక తెలుగు రాష్ట్ర రాజధానిపై ఇంత జరుగుతున్నా.. మంచో చెడో అండగా ఉండాల్సిన మన టాలీవుడ్ నుండి కనీస స్పందన కరువైంది. నేడు విశాఖ ఉద్యమం మనది. భాగ్యనగరం తర్వాత నటీనటులకు ఎంతో ఇష్టమైన విశాఖ నగరానికి మణిపూస స్టీల్ ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీ కోసం కార్మికులు.. ప్రజలు రోడ్డెక్కితే కనీసం సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మన నటులకు లేదా అని సోషల్ మీడియాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల మంత్రులే మన కార్మికులకు మద్దతు ఇస్తుంటే మన హీరోలకు స్పందన కరువైందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా మన వెండితెర హీరోలు కళ్ళు తెరుస్తారా? లేక తమ దృష్టికే రానట్లు.. తామేమీ ఎరుగం అన్నట్లుగానే ఉండిపోతారా అన్నది చూద్దాం!

తెలంగాణ మంత్రే స్పందిస్తే.. ఆంధ్రా హీరోల మౌనమేంటి?