Telangana Congress: నేతలలో ఐక్యతా రాగం.. ఎన్నాళ్ళో?!

513

Telangana Congress: కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కుంపటి.. గ్రూపు రాజకీయాలని పేరు. అందుకే తెలంగాణ రాష్ట్రం ప్రసాదించిన పార్టీ అయినా ఇక్కడ ఆదరణ కోల్పోతూ వచ్చింది. ప్రత్యర్థి కేసీఆర్ తన రాజకీయ చతురతతో దూసుకుపోతున్నా కాంగ్రెస్ లో ఏ మాత్రం కదలిక రాలేదు. పైగా ఒకరిద్దరు నేతలు దూకుడుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసినా గ్రూపు గొడవలతో ప్రజలలో పలచన అవుతూ వచ్చారు. సీనియర్లంటే జూనియర్లకు మంట.. జూనియర్లంటే సీనియర్లకు లెక్కలేనితనం. ఇదే కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది. పార్టీ నాశనం కళ్ళ ముందు కనిపిస్తున్నా తనకు పదవి దక్కలేదని విమర్శలు చేసే వారే కానీ మళ్ళీ ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలని కృషి చేసే వారే కరువయ్యారు.

అయితే.. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలవనీ.. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నిక కోసమవనీ.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని లీడర్లంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. సాగర్ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడమే మా లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు. టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్‌ సహా పలువురు నేతలు ఉమ్మడి జిల్లాలో ఏకతాటిపైకి వచ్చి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలోనే ఉన్న సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని పెంచుతున్నారు. ఇక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పొలంబాట- పోరు బాట పేరుతో రైతులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరో సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తి కోసం నార్కట్ పల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టారు.

మరోవైపు రేవంత్ రెడ్డి, సీతక్క వంటి నేతలు కూడా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. మొత్తంగా నేతలంతా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల ఐక్యత రాగం పై తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇంత ఐక్యరాగం కేవలం ఇప్పుడు ఎన్నికల కోసమా.. లేక ఆ తర్వాత జరిగే పిసిసి ఎన్నిక కోసమా? అంటూ చర్చలు సాగుతున్నాయి. రేపు ఎన్నికల తర్వాత.. పిసిసి ఎంపికలో అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించినా ఇదే ఐక్యమత్యంతో పనిచేస్తారా అంటే నూటికి నూరు శాతం డౌటే అని చెప్పొచ్చు. ఇన్నాళ్ల కాంగ్రెస్ చరిత్రలోనే అలాంటి వాతావరణం చూడలేదు. మరి ఆ చరిత్రను ఇకనైనా తిరగరాసి పార్టీకి జవసత్వాలు నింపుతారా అన్నది చూడాల్సి ఉంది.

Telangana Congress: నేతలలో ఐక్యతా రాగం.. ఎన్నాళ్ళో?!