వాలంటీర్లకు జీతాలు పెంచుతామంటున్న టీడీపీ!

479

ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్.. మున్సిపల్ వార్డుకు ఒక వాలంటీర్. వీళ్ళు ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తరపున వీళ్ళే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వారి వారి పనులు చేసిపెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అద్వర్యంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు తక్కువేం కాదు. అసలు ఈ వాలంటీర్ల నియామకమే విరుద్ధమని గతంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలని వాలంటీర్లు చేశారని.. వాళ్ళు వారి పార్టీ సానుభూతిపరులకే సేవ చేస్తున్నారని టీడీపీ తీవ్రంగా మండిపడింది. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లను చేశామని అంతెందుకు వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డే బహిరంగంగా చెప్పారు.

ఇక వాలంటీర్ల పరంగా చూస్తే వీళ్ళు చాలాకాలంగా లబోదిబో మంటున్నారు. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, మీటింగుల పేరుతో నిత్యం మమ్మల్ని వేధిస్తున్నారని వీళ్ళు వాపోతున్నారు. తమకిచ్చే కొద్ది జీతానికి.. మాతో చేయించే పనికి ఎక్కడా సంబంధమే లేదని.. పైగా మండల కేంద్రాలకు మేము తిరిగే ఖర్చులు కూడా అదనంగా భరించాల్సి వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల విధులను బహిష్కరించడంతో స్పందించిన సీఎం జగన్ మీది ఉద్యోగం కాదు సేవని.. మీకిచ్చేది జీతం కాదు భృతి అని ఏదేదో చెప్పి సముదాయించారు. ఈ మధ్యనే వీరికి సన్మానాలు.. అవార్డులు.. రివార్డులు కూడా ప్రకటించారు.

జీతాల పెంపుపై వాలంటీర్లలో అసంతృప్తి ఇంకా ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగానే వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే. ఇది అన్ని పార్టీలకు తెలుసు.. ప్రజలకు తెలుసు. వారికి వాళ్ళ పార్టీ అధినేత జగన్ న్యాయం చేస్తారని తెలుసు. అయితే.. ఇప్పుడు టీడీపీ వాలంటీర్లకు జీతాలు పెంచుతామంటూ కొత్త పల్లవి అందుకుంది. టీడీపీ అధిష్టానం ఈ మాట చెప్పలేదు కానీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సౌకర్యాలను కల్పిస్తామని ఎంపీ నాని ప్రకటించారు.

ఎంపీ నాని చెప్పిన దాని ప్రకారం వాలంటీర్లకు జీతాల పెంచితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వారినే తమ ప్రభుత్వంలో కూడా కొనసాగించి పెంచుతామని చెప్పారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా అన్నది పక్కనబెడితే వాలంటీర్లకు జీతాల పెంపు మాత్రం ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడున్న వారినే కొనసాగించి పెంచితే అది టీడీపీ కార్యకర్తలలో వ్యతిరేకత పెంచుతుంది. ఒకవేళ వారిని తొలగించి తమ పార్టీ సానుభూతిపరులను నియమించి పెంపు నిర్ణయం తీసుకుంటారా అంటే ఎంపీ నాని ఇప్పుడు చెప్పింది ఆ మాట కానీ కాదు. అసలు ఎంపీ నాని నోటి నుండి వచ్చిందే విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా. అంటే ఎంపీ నానీ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న వాలంటీర్లకు రేపు తమ ప్రభుత్వంలో జీతాలు పెంచుతామని. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉండగా.. టీడీపీ కార్యకర్తలు స్పందనను కూడా భరించే ఓపిక టీడీపీకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే ఈ ప్రకటనకు టీడీపీ అధిష్టానం సై అనాల్సి ఉంది.

వాలంటీర్లకు జీతాలు పెంచుతామంటున్న టీడీపీ!