విజయనగరంలో టీడీపీలో బట్టబయలైన వర్గ విభేదాలు

128
tdp leaders ,conflict ,vizianagaram, ashok gajapathi raju , adithi gajapathi raju , meesala geetha
vizianagaram

విజయనగరం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలుగా విడిపోయింది. పట్టణంలో మరో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. దీంతో ఇన్నాళ్లు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కనుసన్నల్లో సాగుతున్న పార్టీ కార్యకలాపాలకు చెక్‌ పడినట్లయింది. 2014 లో మీసాల గీత ఎమ్మెల్యేగాను, అశోక్ గజపతి రాజు ఎంపీగానూ గెలిచారు. అయితే మీసాల గీత పేరుకు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ పెత్తనమంతా అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతిరాజు చూసుకునేవారన్న టాక్ ఉంది. దాంతో మీసాల గీత వర్గంలో అసంతృప్తి నెలకొంది.. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు మీసాల గీత కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దాంతో గీత అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పటి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఆ సమయంలో గంటా శ్రీనివాసరావు బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు గీత. ఈ క్రమంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గీతను కాదని అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కుమర్తె రాజకీయ భవిశ్యత్ కోసం తనను బలి చేశారన్న కోపం మీసాల గీతలో ఉంది.. ఆ కోపమే 2019 ఎన్నికల్లో విజయనగరంలో టీడీపీ ఓటమికి కారణమైందని అంటుంటారు. ఆ ఎన్నికల్లో మీసాల గీత వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి పరోక్షంగా సహకరించారని అశోక్ వర్గం భావిస్తోంది. దాంతో గీతకు పార్టీలో ప్రాధాన్యత తగ్గేలా అశోక్ వర్గం చేస్తూ వస్తోంది. అయితే అశోక్ గజపతిరాజు తనను టార్గెట్ చేశారని భావిస్తున్న గీత తాజాగా వేరు కుంపటి పెట్టుకున్నారు.

జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న అశోక్‌కుగానీ, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న అదితి జగపతికి గానీ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్‌గా ఇటీవలే నియమితులైన కిమిడి నాగార్జునకుగానీ చెప్పకుండా, వారిని ఆహ్వానించకుండా స్వతంత్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టిసారించింది. విజయనగరంలో నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడకముందే అప్రమత్తమైంది. గీతను మంగళగిరి రాష్ట్ర కార్యాలయానికి పిలిపించుకుని అసంతృప్తికి గల కారణాలపై ఆరాతీసింది. ఈ సందర్బంగా అధిష్టానం ముందు ఆమె కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. బీసీ మహిళా నేత అయిన తనను నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అశోక్ వర్గాన్ని కూడా పిలిపించుకొని ఈ సమస్యకు ముగింపు పలకాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.