TDP-Janasena-BJP: ఈ బంధం ఎన్నటికీ తెగేదికాదు!

1106

TDP-Janasena-BJP: ఈమధ్య వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఒక మాట అన్నారు. ఆయన మనసు ఇంకా టీడీపీలోనే ఉందని.. టీడీపీ నేతలపై ప్రేమ తగ్గలేదని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక పార్టీకి అంటగట్టేలా మాట్లాడడం ముమ్మాటికీ తప్పే. అందుకే విజయసాయి రెడ్డి తర్వాత క్షమాపణలు చెప్పారు. ఇక్కడ ఆ సందర్భం ఎందుకు గుర్తు చేసుకున్నామంటే.. టీడీపీ-బీజేపీ బంధం గురించి గుర్తు కోసమే. నిజమే.. ఆ బంధం ఇప్పటిది కాదు. వాజపేయి, అద్వానీల హయం నుండే చంద్రబాబు బీజేపీకి దగ్గరి మనిషి. ఇప్పటికి ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం అరడజను సార్లు తెగినా.. మళ్ళీ మళ్ళీ అది అల్లుకుపోతూనే వచ్చింది.

Image result for modi chandrababu pawan

ప్రస్తుతానికి ఇది విడాకుల దశలో ఉన్నా కాదు కాదు వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ దగ్గరవడం ఖాయమనే రాజకీయ మేధావులు వందల్లో ఉన్నారు. అదనంగా జనసేన పార్టీ కూడా ఈ కలయికలో ఇప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్. టీడీపీ-జనసేన-బీజేపీ మిత్రబంధం కూడా కొత్తదేం కాదు. 2014 నాటి ఎన్నికలలో మోడీ-చంద్రబాబు-పవన్ కలిసి పాడుకున్న స్నేహగీతాలు.. బహిరంగ సభలలో ఒకరిని ఒకరు ఆకాశానికి మోసుకున్న వ్యాఖ్యానాలు ఇప్పటికీ ప్రజల చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. చరవాణీ తెరల మీద కనిపిస్తూనే ఉన్నాయి. ఆ ఐదేళ్ల బంధం పరిపూర్తి కాకముందే ఎవరికి వారే కటీఫ్ చెప్పేసుకున్నా జనసేనాని ముందే మేల్కొని కమల స్వాగతం చెప్పేసుకున్నారు.

Image result for modi chandrababu pawan

ఇక ఇప్పుడు మిగిలింది టీడీపీ. చంద్రబాబు కూడా ఆ ముక్కోణపు బంధానికి సాదర ఆహ్వానం పలికేందుకు సిద్దంగానే ఉన్నా సమయం సందర్భం అనుకూలించలేదని అనిపిస్తుంటుంది. బహుశా దాన్నే కాలం కలిసిరావడం అంటారేమో. ఎవరికి వారు సుతిమెత్తని విమర్శలతో పూబంతులు విసురుతున్న ఈ సాన్నిహిత్యంలో నేతలే బయటపడడం లేదు కానీ కార్యకర్తలు కలిసి మెలిసి ఉన్నారేమో అనిపిస్తుంది. అందుకు కారణం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు. రాష్ట్రాల్లో అధికార పార్టీ అహంకారాన్ని తట్టుకునేందుకు నేతల మాటలను కూడా లెక్కచేయకుండా బీజేపీ-టీడీపీ-జనసేన నేతలు కలిసిమెలిసి ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ఫ్లెక్షీల సాక్షిగా ఇది బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

ఏపీ బీజేపీలో టీడీపీని విమర్శించే నాయకులు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది సోము వీర్రాజు. ఆ సోమువీర్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్, గతంలో ఆయన పోటీ చేసి ఓడిన కడియం నియోజక వర్గాలలోనే మూడు పార్టీల నేతలు కలిసి పోటీకి దిగుతుంటే.. కార్యకర్తలు కలసి ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ బరిలో అభ్యర్ధులు ఏకంగా మోడీ-పవన్-సోము వీర్రాజు-గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఫొటోలతో ఫ్లెక్షీలు ఏర్పాటుచేసి ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ జనసేన కంటే బీజేపీ బలంగా ఉన్నా పోటీలో మాత్రం వెనకపడ్డారు. పోటీకి దిగే విషయంలో బీజేపీ కన్నా జనసేన ముందుంది. అందుకే జనసేన-టీడీపీ అవగాహనతో కలిసి మెలిసి పోటీలో నిలబడితే బీజేపీ ప్రచారంలో కలిసి సహకరిస్తుంది.

ఇది ఒక్క సోము ఇలాకాలోనే కాదు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డికి చెందిన అనంతపురం, ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కడప, ఎంపీ టిజి వెంకటేష్‌కు చెందిన కర్నూలు, మరో ఎంపీ జీవీఎల్‌కు చెందిన గుంటూరు జిల్లాలోనూ కనిపిస్తోంది. బీజేపీ చాలాచోట్ల అసలు పోటీనే పెట్టకపోగా పోటీలో ఉన్న టీడీపీ-జనసేన అభ్యర్థులకే జైకొడుతుంది. మూడు పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతలే కూర్చొని పలుచోట్ల ఒప్పందాలు చేసి కార్యకర్తలను కలుపుతుంటే.. మరికొన్ని చోట్ల గ్రామస్థాయి నేతలే కూర్చొని పరస్పరం అవగాహనకు వస్తున్నారు. ఇదే పరిస్థితి పంచాయతీల నుండి మున్సిపల్ ఎన్నికల వరకు కొనసాగితే.. హైకమాండ్స్, పార్టీల అధ్యక్షులే వద్దన్నా కార్యకర్తలు ఆగే పరిస్థితి లేదన్నది ఈ చిత్రాలు చెప్తున్న సత్యం!

TDP-Janasena-BJP: ఈ బంధం ఎన్నటికీ తెగేదికాదు!