Tamilanadu Elections: ఎన్నికల బరిలో సినీనటుల జాతర!

10615

Tamilanadu Elections: దేశంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు అటు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు ప్లాన్ చేస్తూ సమాయత్తమయ్యాయి. అయితే.. ఈ ఎన్నికలలో తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడి రాజకీయాలలో ఇప్పుడు సినీ నటుల వైభవం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అధికార ఏఐఏడీఎంకే.. బీజేపీ పొత్తుగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తుండగా ఆ కూటమిలో అలనాటి హీరోయిన్స్, ఇప్పటి నటీమణులు ఖుష్బూ, గౌతమి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా బీజేపీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీకి దిగి ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు విలక్షణ నటుడిగా.. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి హీరో అయిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా పోటీకి దిగారు. కమల్ కి తోడు శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ ఏఐఎస్ఎంకే కూడా పొత్తుగా బరిలో దిగుతున్నట్లుగా ప్రకటించింది. ఇక ఎప్పటి నుండో రాజకీయాలలో ప్రత్యక్షంగా ఉంటూ ఎండీఎంకే పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగిన విజయకాంత్ కూడా ఈ ఎన్నికలలో కీ రోల్ పోషించాలని కసితో ఉన్నారు. వీరితో పాటు కరుణానిధి మనవడు.. స్టాలిన్ కుమారుడు.. తమిళనాట ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ ఎన్నికలలో చెపాక్ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేస్తున్నాడు. ప్రస్తుతం పార్టీ యువజన సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఉదయనిధి ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నాడు.

దీంతో ఇప్పుడు తమిళనాట ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలలో సినీ నేపథ్యం ఉన్నవాళ్లే ఉండగా వాళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార ఏఐఏడీఎంకేను స్థాపించింది లెజెండ్ ఎంజీఆర్ కాగా ఆ తర్వాత ఆ పార్టీని నడిపించింది జయలలిత. ఆ ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వారే. ఇప్పుడు ఆ పార్టీకి ఇక్కడ ఇండస్ట్రీలో కొందరి సానుభూతి ఉండగా బీజేపీతో పొత్తుతో కుష్బూ, గౌతమి కూడా తోడయ్యారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకేను స్థాపించింది కరుణానిధి కాగా ఆయనా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన వ్యక్తే. ఇప్పుడు మనవడు ఉదయనిధి ఇండస్ట్రీలో తన వంతు ప్రయత్నం తాను చేస్తూ రాజకీయాలలో కూడా ఎదిగే ప్రయత్నాలలో ఉన్నాడు.

వీరితో పాటు ఇప్పుడు ప్రధాన పోటీగా ఉన్న కమల్ హాసన్, విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యంగ్ హీరో విశాల్ తో పాటు మరికొందరు హీరోలు నటులు కూడా పోటీ చేయకపోయినా రాజకీయాలలో యాక్టివ్ గానే ఉన్నారు. పలువురు పార్టీలను కూడా స్థాపించగా పోటీ చేయలేదు. వీరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమే. వస్తా వస్తా అంటూ ఊరించి ఊరించి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది ఇక్కడ రాజకీయ వర్గాలను కలవరపరిచే అంశమే.

మొత్తంగా చూస్తే ప్రతిపార్టీ సినీ నేపథ్యమే కాగా ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆసక్తిగా కనిపిస్తుంది. సహజంగానే సినీ, రాజకీయ రంగాలను విడదీసే పరిస్థితి లేదు. ముఖ్యంగా దక్షణాదిలో ఈ రెండు రంగాల మధ్య తేడా అసలే లేదు. ఇక్కడ నుండి అక్కడకి.. అక్కడ నుండి ఇక్కడకి జంపింగ్ చాలా సున్నితంగా జరిగిపోయే అంశం. అయితే.. తమిళనాడులో ఇది పీక్స్ కి చేరింది. ఈ ఎన్నికలలోనే ఎటు చూసినా సినిమా వాళ్లే కనిపిస్తున్నారు. ప్రచారంలో కూడా సినీ నటుల జాతర కనిపిస్తుంది. నచ్చితే గుడి కట్టేసేంత అభిమానం ఉండే తమిళనాట ప్రజలు ఇప్పుడు ఏ దేవుడికి భక్తులుగా ఉంటారో చూడాల్సి ఉంది.