తమిళ్ పాలిటిక్స్.. పీకే టీంకు ట్విస్టులే ట్విస్టులు!

1592

దేశంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు హోరాహోరీ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. అందులో పశ్చిమబెంగాల్ లో నువ్వా నేనా అన్న పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనా ఫలితాలు వెలువడగా తమిళనాడులో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ రాజకీయం కొనసాగుతుంది. అందుకే తమిళ రాజకీయం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సైతం షాక్ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. పీకే అంటే విన్నింగ్ బ్రాండ్ గా పేరున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీని మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రిని చేసిన దగ్గర నుండి ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టేవరకు.. జగన్ నుండి కేజ్రీవాల్ వరకు ఆయన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేసిన చరిత్ర పీకే సొంతం. ఇప్పుడు ఆయన అవసరం తప్పక ఉందని భావించిన డీఎంకే అధినేతలు తమ వ్యూహకర్తగా పీకేని రంగంలోకి దింపారు.

అయితే.. అరవ రాజకీయాలు ఒకపట్టానా అంతుచిక్కవని పేరుకటుంది. ఇక్కడ ఒకేపార్టీ రెండవసారి అధికారం దక్కించుకోవడం అంటే కత్తిమీద సామేనని చెప్తారు. కానీ అంచనాలను తల్లక్రిందులు చేస్తూ గత ఎన్నికలలో జయలలిత మరోసారి విజయదుందుభి మ్రోగించారు. కానీ అప్పుడున్న పరిస్థితిలు రాష్ట్రంలో ఇప్పుడు లేవు. ఐదేళ్లు తిరిగేసరికి ప్రత్యర్థులిద్దరూ జయలలిత, కరుణానిధి ఇప్పుడు లేరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఇదే అదనుగా అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా డీఎంకే వ్యూహం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్తగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపారు.

పీకే టీం కూడా తనదైన శైలిలో వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. వాటినే అమలు పరుస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇక్కడ రాజకీయాలలో ట్విస్టులు పీకే టీంకు షాక్ తగిలేలా చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ ఇక్కడ రాజకీయాలను మలుపు తిప్పనుందని పీకే అండ్ కో అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు రాసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన రాజకీయాలకు దూరం ప్రకటించడంతో మొదలైన ట్విస్టుల పరంపర శశికళ రాజకీయ సన్యాసం వరకు మలుపుల మీద మలుపులు తిప్పేసింది. నిజానికి రజనీ.. కమల్, శశికళ ఫీల్డ్ లో ఉంటే డీఎంకే గెలుపు గ్యారంటీ అనే టాక్ నడిచింది. ఏఐడీఎంకే ఓటు బ్యాంక్ చీలికతో స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకేనని పీకే టీం అంచనావేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా మారిపోయింది.

అయితే.. పరిస్థితి ఎలాంటిదైనా.. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వడం ప్రశాంత్ స్టైల్ అని రాజకీయ వర్గాల నమ్మకం. అందుకు స్టాలిన్ పీకే మీద కొండత ఆశతో ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిల్లో కూడా పీకే విజయతీరాలకు చేర్చగలరనే డీఎంకే క్యాడర్ నమ్ముతుంది. అయితే.. ఏఐడీఎంకే పొత్తుతో బీజేపీ జతకలవడం.. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలు కావడం.. ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ సమీకరణాలతో ప్రజల నాడిని పూర్తిగా అంచనా వేయలేకపోవడం పీకే అండ్ కోకు కాస్త ఇబ్బందికర పరిస్థితి. అందునా ఎన్నికలకు ఇంకో నెలరోజులే గడువు. ఈ ముప్పై రోజుల్లో ప్రశాంత్ ఇక్కడ రాజకీయాలను మలుపులు తిప్పుతారా? ఈ పరిస్థితుల నుండి స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు నడిపించగలరా? బీజేపీ అధిష్టానం మెదళ్లలోని వ్యూహాలకు పీకే తమిళనాడులో మందేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

తమిళ్ పాలిటిక్స్.. పీకే టీంకు ట్విస్టులే ట్విస్టులు!