తమిళనాడు పాలిటిక్స్ మరో ట్విస్ట్.. బరిలోకి రాధికా!

53

త్వరలో తమిళనాడు సాధారణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఎన్నికల వరకు అటు డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన పోటీదారులుగా ఉంటే విజయకాంత్, మరికొన్ని చిన్న చితకా పార్టీలు పోటీలో ఉండేవి. అయితే.. అన్నాడీఎంకే నుండి మెయిన్ పేస్ జయలలిత మరణాంతరం ఆ పార్టీలో ఎన్నెనో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం చిన్నమ్మ శశికళ ఇక్కడి రాజకీయాలలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పటికే కమల హాసన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం లేదని ప్రకటించగా ఆ పార్టీలో ఇప్పటికే కీలకంగా ఉన్న నేతలు పోటీకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగానే కోలీవుడ్ నుండి ఇంకా రాజకీయ బరిలో దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక.. ఇప్పటికే రాజకీయాలలో ఉన్న సినీ నటి రాధికా కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికలలో దిగనున్నట్లుగా తెలుస్తుంది. తన భర్త శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమత్తువ మక్కల్‌ కట్చి పార్టీకి రాధికా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు.

తాజాగా జరిగిన దక్షిణ మండలానికి చెందిన నేతల పార్టీ సమావేశంలో పాల్గొన్న శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. తన భార్య రాధికా ఈసారి పోటీకి దిగనున్నట్లుగా ప్రకటించారు. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న ఎస్ఎంకెపీ ఈసారి కూడా అదే కూటమిలో కొనసాగుతోందని, అయితే ఈసారి ఒకటీరెండు సీట్లిస్తే సరిపెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పది సీట్లకు పైగా కేటాయించాలని పట్టుబడతామని చెప్పారు. కాగా రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన శరత్ కుమార్ ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్నది త్వరలోనే చెప్తామన్నారు.

తమిళనాడు పాలిటిక్స్ మరో ట్విస్ట్.. బరిలోకి రాధికా!