బాధితురాలిని పెళ్లి చేసుకొనేందుకు రేప్ కేస్ యువకుడికి స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు!

302

ఆ ఇద్దరూ ప్రేమికులు. మూడేళ్లుగా దేశం కాని దేశంలో ప్రేమించుకున్నారు. మానసికంగానే కాదు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. తీరా పెళ్లి చేసుకోమంటే కులం పేరు చెప్పి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని యువకుడు మొహం చాటేశాడు. గత ఏడాది ఇండియాకి తిరిగొచ్చిన యువతి ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మధ్యనే ఇండియాకి వచ్చిన యువకుడిని పోలీసులు అత్యాచారం కేసులో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. చివరిగా యువతితో రాజీకొచ్చిన యువకుడు సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ కావాలని వేడుకుంటే.. ముందు పెళ్లి చేసుకొని రా బెయిల్ అప్పుడు చూద్దాం అని ప్రస్తుతానికి కేసులో స్టే ఇచ్చింది.

అచ్చం ఇదేదో సినిమా స్టోరీనా అనేంతగా ఆసక్తిగా ఉంది కదా ఈ కేసు. కానీ ఇదే నిజం. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌లోని జాట్‌ సిక్కు కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఆస్ట్రేలియాలో ఉండగా 2016లో ఆస్ట్రేలియాలోనే ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతితో శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి ప్రస్తావన రావడంతో తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంలేదని తేల్చిచెప్పాడు. దాంతో ఆ యువతి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఇటీవల గుర్‌దాస్‌పూర్‌కు ఆ యువకుడు రావడంతో పోలీసులు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు.

తనకు బెయిల్‌ ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించడంతో యువకుడు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చీఫ్‌ జస్టిస్‌ బొబ్డె నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ విచారణకు రాగా.. బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం కుదిరిందని యువకుడు కోర్టుకు విన్నవించాడు, మరో 6 నెలల్లో పెళ్లి చేసుకునేలా అమ్మాయి కుటుంబంతో ఒప్పందం చేసుకున్నామని, ఒప్పందం కాపీని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాడు. కానీ కోర్టు మాత్రం ముందు పెళ్లి చేసుకుంటేనే బెయిల్ గురించి ఆలోచిస్తామని తెగేసి చెప్పింది. పెళ్లి చేసుకుంటానని అంటున్నావ్ కనుక అప్పటి వరకు పోలీసులు అరెస్ట్‌ చేయకుండా స్టే మాత్రం ఇచ్చింది. దీంతో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

బాధితురాలిని పెళ్లి చేసుకొనేందుకు రేప్ కేస్ యువకుడికి స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు!