Summer Season: మార్చి మొదలు.. ఠారెత్తిస్తున్న ఎండలు!

151

Summer Season: శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. వేసవి ఆరంభం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో రేడియేషన్‌ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఈ ఏడాది సుదీర్ఘకాలం శీతాకాలం కొనసాగగా ఫిబ్రవరి మూడో వారం వరకు చలి వాతావరణం నెలకొంది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. అయితే వారం నుంచి చలి తీవ్రత తగ్గి ఎండ పెరిగింది.

సముద్రం నుంచి తేమగాలులు, రాష్ట్ర పరిసరాల్లో ఆవర్తనాలు లేకపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉంది. దీనికితోడు నైరుతి నుంచి గాలులు వీయడంతో వాతావరణం వేడెక్కింది. సాధారణంగానే సూర్యుడు దక్షిణార్థ గోళం నుంచి ఉత్తరార్థ గోళం వైపు పయనించే క్రమంలో దక్షిణ భారతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి ప్రవేశిస్తున్నందున ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.

వేసవి ప్రారంభం కావడంతో బయటకు వెళ్లే వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరించారు. ఎండలలో తిరగడం, పని చేయడం వల్ల శరీరంలో ఉండే సోడియం, నీరు చమట రూపంలో ఆవిరైపోతాయి. దీంతో శరీరం నీరసించి వడ దెబ్బకు గురి కావాల్సి వస్తుంది. వాంతులు, విరేచనాలు కలిగి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు కలుగనున్నది. కాబట్టి పనులకు వెళ్లే వారు వెంట గొడుగులను సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను, మంచి నీరు, పండ్ల రసాలను తీసుకెళ్లాలి. భోజన సమయంలో వీటిని తీసుకుంటే మంచిది. చిన్న పిల్లలు, గర్భిణులు, 50 ఏండ్లు దాటిన వారు ఎండకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కనీసం సగటున 4 నుంచి 5 లీటర్ల నీరు తాగుతూ శరీరానికి నీటిని, బలాన్నిచ్చే పండ్లు తీసుకోవాలి.

ఎండతీవ్రతతో వెంటనే అలసట, దాహానికి గురవుతున్న జనం పరిస్థితులను తట్టుకోవడానికి శీతల పానీయాలను సేవిస్తున్నారు. శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని కొందరు కొబ్బరి బోండాలు, నిమ్మ రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతుండడం.. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఫ్యాన్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టితో తయారు చేసి కుండలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ప్రతి కుండపై రూ.20 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. అయినా ప్రజలు వాటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.