శృంగారానికి సహకరిస్తేనే పరీక్షల్లో పాస్ చేస్తా..

85

శృంగారానికి సహకరిస్తేనే పాస్ మార్కులు వేస్తానని విద్యార్థినిలను వేధింపులకు గురిచేస్తున్నాడు ఓ లెక్చరర్. ఒకరిద్దరిని కాదు సుమారు 50 మంది విద్యార్థినిలను ఇలానే వేధించాడు. చివరికి కీచక లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థినిలు కాలేజీకి వచ్చిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు.

ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం నీమ్‌రానాలోని ఓ ప్రభుత్వ కాలేజీలో వెలుగుచూసింది. కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు తెలిపారు. అతడి బారినుంచి తమను రక్షించాలని వేడుకున్నారు. గతంలో కూడా ఇదే విధంగా చేశాడని, ఇప్పుడు తమ బ్యాచ్ వారితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లెక్చరర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు.

శృంగారానికి సహకరిస్తేనే పరీక్షల్లో పాస్ చేస్తా..