ఇప్పటికీ ఎస్ఈసీ మీద విమర్శలు.. వైసీపీకి లాభమా.. నష్టమా?

433

ఏపీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఎన్నికలైనా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వాతావరణం వేడెక్కుతుంది. కానీ ఈ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఎన్నికలకు ఏడాది నుండే వేడి మొదలైంది. గత ఏడాది నుండి మొదలైన ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్నికల జరపకూడదని మొండిగా ఉంటే.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని జగమొండిగా మారి చివరికి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ రాంజ్యాంగానికి కట్టుబడి బతకాల్సిన ప్రాధమిక సూత్రం ఆధారంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

అయితే.. ఇష్టం ఉన్నా లేకపోయినా పంతం నెగ్గించుకోలేకపోయినా ఏపీ ప్రభుత్వం తప్పక, మనసొప్పక ఎన్నికలు జరిపిస్తున్నారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అప్పటి వరకు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, దూషణలు అన్నీ మానేసి ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. కానీ.. వైసీపీ నేతలు మాత్రం ఇంకా అదే ఆరోపణలు, అదే వ్యక్తిగత దూషణలతో కాలం గడిపేస్తున్నారు. మంత్రులు, పార్టీలో ముఖ్యనేతలు సైతం ఎస్ఈసీ రమేష్ కుమార్ మీద అదే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది ఆ పార్టీకి, తమ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి మంచిదా.. కదా అంటే ఖచ్చితంగా నష్టమేనని చెప్పాలి.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపు నుండి ఈ మధ్య ఎన్నికల వ్యవహారంలో కోర్టుల వరకు ప్రభుత్వానికి చాలా నష్టమే జరిగింది. రాజ్యాంగానికి, మౌఖిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని సామాన్య ప్రజలకు సైతం అవగతమైంది. జరగాల్సింది.. జరిగింది.. ఇక ఇప్పుడు చేయాల్సింది ఏమైనా ఉందా అంటే అందరూ కలిసి పనిచేసి ఈ ఎన్నికలలో తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోవాలి. కానీ.. మంత్రులు, వైసీపీ నేతలు పదే పదే ఎస్ఈసీను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా తన పని తాను చేసుకున్నట్లుగా రమేష్ కుమార్ కనిపిస్తే.. ఏం చేయలేని నిస్సహాయతలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజలలో కలుగుతుంది.

రాష్ట్రంలో అభివృద్ధి, పాలన ఎలా ఉన్నా.. సంక్షేమంలో ఈ ప్రభుత్వం మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలలో ఇది తమ ప్రభుత్వంగా ఒక భావన కలుగుతుంది. ఆ మైలేజీని ఓటు బ్యాంకుగా మార్చుకొని లోకల్ లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటే అది వచ్చే ఎన్నికలకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ.. ఇప్పుడు ఆ ప్రయత్నాల కన్నా ఎస్ఈసీ రమేష్ కుమార్ తమకేదో అన్యాయం చేశారనే భావనలో ఉన్న నేతలు ఇంకా ఇంకా మీడియా ముందు దూషణలు చేస్తుంటే అది ఏ మాత్రం పార్టీకి మంచిది కాదు. సీఎం జగన్ దృష్టిలో ఇలాంటి వారికి సానుభూతి వస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో తీరని నష్టం తెచ్చిపెడుతుంది. సో ఇకనైనా వైసీపీ నేతలు మేల్కొంటే వారికే మంచిది!

ఇప్పటికీ ఎస్ఈసీ మీద విమర్శలు.. వైసీపీకి లాభమా.. నష్టమా?