బెంగాల్ లో నువ్వా?.. నేనా?

432

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2011 వరకు ఇది కమ్యూనిస్టుల కంచుకోట.. ఆ తర్వాత అనేక ఉద్యమాలతో తృణముల్ విజయం సాధించింది. కమ్యూనిస్టు కోతలను బద్దలు కొట్టి మమతా సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది. ఆ తర్వాత బెంగాల్ ను అభివృద్ధివైపు నడిపించింది. కరెంట్ లేని పల్లెలు, తాగు నీరు సరిగా లేని పట్టణాలపై దృష్టిపెట్టి త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇదే ఉప్పుతో 2016 అసెంబ్లీ ఎన్నికలో తిరుగులేని విజయం సాధించింది మమత.. సొంతంగా 211 స్థానాల్లో విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో తృణమూల్ బలపడింది..

2021 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి

2021 అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016 వరకు పశ్చిమ బెంగాల్ లో ఓ చిన్నపాటి పార్టీగా ఉన్న బీజేపీ అంచలంచలుగా ఎదిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికీ తృణమూల్ కు కొరకరాని కొయ్యలా తయారైంది బీజేపీ. 2014లో 2 స్థానాలకే పరిమితమైన ఈ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 19 స్థానాల్లో విజయం సాధించి మమతకు సవాల్ విసిరింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమదే విజయం అని బీజేపీ ఘంటాపదంగా చెబుతుంది. మమతను ఇంటికి పంపడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతన్నారు.

ప్రచారం హోరు

ప్రచారం జోరుగా సాగుతుంది. ఎవరు కూడా తగ్గడం లేదు.. కేంద్ర పెద్దలు పశ్చిమ బెంగాల్ లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. మమతా సారథ్యంలో సభలు ఏర్పాటు చేసి తాము మూడో సారి అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి తమకు బీజేపీనే అని తృణముల్ నేతలు భావిస్తున్నారు. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో బీజేపీ బలపడింది.

ఎవరి ఓటు ఎటు

పశ్చిమ బెంగాల్ లో ఆదివాసీ, దళితుల ఓట్లు 30 శాతం ఉంటాయి. ముస్లిం ఓటు బ్యాంకు కూడా ఈ రాష్ట్రంలో అధికంగా ఉంది. అయితే బెంగాల్ లో బాంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు అధికంగా ఉన్నారు. వీరంతా తృణమూల్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక వలసవాదులను వ్యతిరేకించే వారు కూడా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వీరంతా బీజేపీని బలపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో ముస్లిం ఓటర్లు మమతకు మద్దతుగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగుతుంది. దింతో తృణమూల్ కు ముస్లిం ఓట్ల గండిపడే అవకాశం కనిపిస్తుంది. ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు చీలిపోతే తృణమూల్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక బీజేపీ హిందువుల ఓట్లను టార్గెట్ చేసుకుంది. రాష్ట్రంలో 50 నుంచి 55 శాతం ఉన్న హిందువులు తమకు అండగా ఉంటారని బీజేపీ భావిస్తుంది.

బీజేపీకి కలిసొచ్చే అంశాలు

బెంగాల్ లో బీజేపీ గాలులు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతన్నారు. ఓ వర్గంపై బెంగాల్ లో తీవ్రమైన అణచివేత ఉందని వారే తృణమూల్ కోటలను కూల్చుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ హిందూ పండగలకు కూడా అనేక షరతులు ఉన్నాయని, మమత నిర్ణయాలతో విసిగి వేసారిన ఈ వర్గం వారు తృణమూల్ పీఠం కదిలిస్తారని అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగిత కూడా అధికంగా ఉండటం తృణమూల్ కు సవాల్ గా మారింది.

తృణమూల్ ప్రభుత్వంలో అనేక స్కాములు జరిగాయి. వాటిని ఎత్తి చూపడంలో బీజేపీ విజయం సాధిస్తే తృణమూల్ ను ఎదురుకోవడం సులువవుతుంది. ఒక బెంగాల్ ప్రజలు పోలీసుల తీరుపై విసిగిపోయారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజలపై దాడులకు దిగడాన్ని బెంగాల్ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక్కసారి అధికార పార్టీ కార్యకర్తలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మీడియా ముందు మొరపెట్టుకున్నా సందర్భాలు ఉన్నాయి.

తృణమూల్ కు కలిసొచ్చే అంశాలు

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పశ్చిమ బెంగాల్ అభివృద్ధిలో పర్వాలేదనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీటి సదుపాయం ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇక ఇక్కడ విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చి మంచి పేరు సంపాదించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యాలయాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువును చేరువ చేశారు మమత. మారుమూల గ్రామాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ మమతకు కలిసివచ్చే అంశాలుగా చెప్పవచ్చు. అయితే ఆమె అల్లుడిపై అనేక అభియోగాలు ఉన్నాయి. ఇది తృణమూల్ కు గట్టి దెబ్బకొట్టే అవకాశం ఉంది.

బెంగాల్ లో నువ్వా?.. నేనా?