దక్షణాది దేశం ఉద్యమం.. సర్వత్రా చర్చ మొదలైంది!

355

నిర్లక్ష్యం.. అణచివేత.. సవతి ప్రేమ ఇలా కొన్ని పదాలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఒక రాష్ట్రం.. ఒక దేశంలో కొన్ని ప్రాంతాలను ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం మొదలైతే ఈ పదాలు వాడుకలోకి వచ్చి క్రమేపీ ఉద్యమానికి నాంది పడుతుంది. ఇలాంటి సందర్భాలు చరిత్రలో చాలానే చూశాం కానీ తెలుగు ప్రజలు అత్యంత దగ్గరగా చూసిన ఉద్యమమైతే తెలంగాణలోనే. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ఆదాయం వచ్చే తెలంగాణ ప్రాంతాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని దశాబ్దాలుగా ప్రజలు, నేతలు ఉద్యమం నడిపి చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు.

సరిగ్గా.. ఇప్పుడు దేశంలో కూడా అదే తరహా ఉద్యమం ఒకటి వస్తుందని ఓ కొత్త అంశం తెరమీదకి వచ్చింది. అదే దక్షణాది దేశం కావాలట. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా దక్షణాది రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఇక్కడి ప్రజలు.. నేతలు సమయం వచ్చిన ప్రతిసారి చెప్పే మాట. నిజానికి దేశంలో అత్యధిక పన్నులు వసూళ్లు అయ్యేది దక్షణాది రాష్ట్రాలలోనే. కానీ కేంద్రం నిధుల కేటాయింపు.. ప్రాధాన్యతలో మాత్రం ముందుగా కనిపించేది ఉత్తరాది రాష్టాలపైనే. తాజాగా ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కూడా అదే పక్షపాతం కనిపించడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది.

తాజా బడ్జెట్ లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొన్ని నిధులు కేటాయించినా ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడం.. కేటాయించిన నిధులు సైతం ఎలా ఖర్చు చేస్తారు.. వచ్చే ఏడాదిలోనే ఆ నిధులు ఇస్తారా లేదా అన్న విషయంలో బడ్జెట్ లో స్పష్టత లేదన్నది నిపుణుల వాదన. మరోవైపు ఈ బడ్జెట్ జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రూపొందించారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టడంతో ఈ అంశంపై సహజంగానే చర్చ మొదలైంది.

జమిలి ఎన్నికలు.. అధ్యక్ష విధానంలోకి మన పాలన మారితే దక్షణాది రాష్ట్రాల ఓట్లతో అవసరం ఉండదు. అప్పుడు సహజంగానే వివక్ష తీవ్ర స్థాయికి చేరుతుంది. దీంతో దక్షణాది దేశం కావాలనే ఉద్యమం వస్తుందన్న అంశంలో పెద్దగా ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే.. జమిలి ఎన్నికల అనంతరం అప్పటికప్పుడు ఈ ఉద్యమం వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్రం అన్ని రాజకీయ కోణాలపై దృష్టి పెట్టే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ.. వివక్ష కొనసాగితే మాత్రం భవిష్యత్ లో దక్షణాది దేశం ఉద్యమం రావడం తప్పనిపరిస్థితి అవుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

దక్షణాది దేశం ఉద్యమం.. సర్వత్రా చర్చ మొదలైంది!