AP Panchayat elections : నిమ్మగడ్డపై దాడి సరైనది కాదు – సోము వీర్రాజు

51

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య అగ్గి రాజేసిన విషయం తెలిసిందే. క్లిష్టపరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం అంటే, నిర్వహించి తీరుతామని ఎస్ఈసీ తేల్చి చెప్పింది.. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్తూ మొదటి విడత నామినేషన్లను కూడా పూర్తి చేసింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నా ఎస్ఈసీ ప్రభుత్వం మధ్య మాటల దాడి పెరుగుతూనే ఉంది. ఎస్ఈసీ వైసీపీ మంత్రులపై గోవర్నర్ కు ఫిర్యాదు చెయ్యడంతో వివాదం మరింత ముదిరింది.

ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. వైసీపీ నేతలు ఎస్ఈసీపై మాటల దాడి చేయడం తగదని హితవు పలికారు. మాటలు దేనికి పరిస్కారం కావని, అవి ప్రభుత్వానికి, ఎస్ఈసీ మధ్య దూరం పెంచుతాయని తెలిపారు. ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోము వీర్రాజు అన్నారు. ఈ విధమైన ప్రభుత్వం చర్యలను బీజేపీ పూర్తిగా ఖండిస్తుందని ప్రభుత్వం ఎన్నికలపై దృష్టి పెట్టి.. సజావుగా జరిగేలా చూడాలని సోము వీర్రాజు సూచించారు.

మరోవైపు నామినేషన్ల సమయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పలు చోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. బెదిరింపులకు దిగారు. ఇరు పార్టీల నేతలు బెదిరింపులకు దిగడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో ఎన్నడూ ఈ విధంగా ఎన్నికల విధానం కానీ, మాటలు కానీ.. పార్టీల మధ్య బేధాలు కానీ రాలేదని. ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి గట్టిగానే ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఫలితాల రోజు ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు.

AP Panchayat elections : నిమ్మగడ్డపై దాడి సరైనది కాదు – సోము వీర్రాజు