Siddipeta: పసిబిడ్డను 35 వేలకు అమ్మేసిన కన్న తల్లి!

192

క్రూర మృగాలు సైతం తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలపై ఎనలేని మమకారం పెంచుకుంటాయి. సాధుజంతువులు సైతం తన బిడ్డల జోలికి వస్తే తిరగబడతాయి. నోరు లేని వాటికే అంత మమకారం ఉంటే ఇక మనుషులకు ఎంత ఉండాలి. కానీ కంటికి రెప్పాలా కాపాడాల్సిన తల్లి కాటేసింది. కర్కషంగా వ్యవహరించింది. భూమిపై అడుగుపెట్టిన ఆ పసికందు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే కన్నతల్లే అమ్మకానికి పెట్టింది. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి కన్న ఆ బిడ్డను జస్ట్ రూ.35 వేలకు అమ్మేసింది.

తీరా చిన్నారికి టీకా వేసేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లపల్లికి చెందిన ఓ మహిళ ఈ నెల 14వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించగా పండంటి ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల తర్వాత చిన్నారికి టీకా వేసేందుకు అంగన్‌వాడీ సిబ్బంది మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ చిన్నారి లేకపోవడంతో తల్లిని నిలదీయగా తానే రూ. 35 వేలకు పాపను అమ్మేసినట్టు ఒప్పుకుంది. అంగన్ వాడీ సిబ్బంది అధికారులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు పాపను ఎవరికి అమ్మేశారో ఆరా తీసుకున్నారు.